
నార్త్‌సౌండ్: వెస్టిండీస్-శ్రీలంక మధ్య సోమవారం జరిగిన మూడో వన్డేలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌కు కొంతసేపు తెనేటీగలు అంతరాయం కలిగించాయి.శ్రీలంక ఇన్నింగ్స్ 38వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విండీస్ బౌలర్ అండర్సన్ ఫిలిప్ బౌలింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా తెనేటీగల గుంపు మైదానాన్ని చుట్టుముట్టింది. గమనించిన ఆటగాళ్లు, అంపైర్లు.. వాటి నుంచి రక్షణ కోసం ఫీల్డ్‌పై పడుకున్నారు. కాసేపటికి ఆ గుంపు.. ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆట కొనసాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇలా తెనేటీగలు ఆటకు అంతరాయం కలిగించడం ఇదే తొలిసారి కాదు. 2019 వరల్డ్‌కప్ సందర్భంగా సౌతాఫ్రికా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. కాసేపటి తర్వాత ఆట మొదలైంది. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలోనూ ఆతిథ్య వెస్టిండీసే గెలుపొందింది. సమష్టిగా రాణించి 5 వికెట్లతో లంకను చిత్తు చేసింది.ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ జట్టులో హసనరంగ (60 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్‌లతో 80), బంద్రా (55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో హుస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోసఫ్, జేసన్ మహ్మద్ తలో వికెట్ తీశారు.
అనంతరం 275 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ ఎవిన్ లావిస్ (13) నిరాశపరిచినా.. డారెన్ బ్రావో ( 132 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102) సెంచరీ, షై హోప్ (64), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీలు బాదడంతో 48.3 ఓవర్లలోనే విండీస్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శ్రీలంక బౌలర్లలో లక్మల్ రెండు, హసనరంగ, తిసారి పెరీరా, గుణతిలక తలో వికెట్ పడగొట్టారు. ఈ నెల 21 నుంచి ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.