ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు క్రికెట్ అభిమానులకు జియో హాట్‌స్టార్ భారీ షాక్ ఇచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను డబుల్ చేసింది. ఈ కొత్త రేట్లు ఈ నెల 28వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకునేవారికి ఈ ధరలు వర్తిస్తాయి.
ప్రస్తుతం ప్రీమియం వార్షిక ప్లాన్ ధర రూ.1499 ఉండగా.. పెంచిన ధరల ప్రకారం దీని ధర 2,199 రూపాయలకు చేరింది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల రేట్లను కూడా జియో హాట్‌స్టార్ పెంచేసింది. మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇక నుంచి నెలకు రూ. 79, మూడు నెలలకు రూ. 149, ఏడాదికి రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో ఒక్క డివైజ్‌లో మాత్రమే జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్స్‌లో యాడ్స్ కూడా వస్తాయి.
'సూపర్' సిరీస్ ప్లాన్ తీసుకోవాలనుకునే వారు రూ.149, మూడు నెలలకు రూ.349, సంవత్సరానికి రూ.1,099 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రెండు డివైజ్‌లో జియో హాట్‌స్టార్‌ను వీక్షించవచ్చు. ఇందులో కూడా ప్రకటనలు వస్తాయి. 'ప్రీమియం' సిరీస్ ప్లాన్ ధర నెలకు రూ. 299, మూడు నెలలకు రూ. 699, ఏడాదికి రూ. 2,199గా నిర్ధారించారు. ఈ టాప్ ప్లాన్‌తో నాలుగు డివైజ్‌ల్లో జియో హాట్‌స్టార్‌ను ఆస్వాదించవచ్చు. ఇందులో ప్రకటనలు రావు. ఈ ప్లాన్‌లో క్రీడా ఈవెంట్స్‌తో పాటు లైవ్ ప్రోగ్రామ్స్‌ను కూడా యాడ్స్ లేకుండా చూడవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లల్లో చోటు చేసుకున్న తాజా మార్పులు డిజిటల్ వీక్షకులకు మరింత అనుకూలంగా ఉంటాయని జియో హాట్ స్టార్ మేనేజ్‌మెంట్ తెలిపింది. వీక్షకుల అభిరుచులు, మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్లాన్లను రూపొందించామని వివరించింది. గత ఏడాది కనెక్టెడ్ టీవీ యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని జియోహాట్‌స్టార్ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన 11 నెలల్లో బిగ్ స్క్రీన్‌లపై వీక్షణ గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది.
గూడ్ న్యూస్ ఏంటంటే.. పాత సబ్‌స్క్రైబర్లుకు ఈ రేట్లు వర్తించబోదని, ఆటో రెన్యూవల్ సెట్టింగ్స్ యాక్టివ్ గా ఉన్నంత వరకు పాత ప్లాన్ ధరలే వర్తిస్తాయని తెలిపింది. నూతన సూపర్, ప్రిమియం ప్లాన్స్ అందుకున్న వారికి హాలీవుడ్ కంటెంట్ డిఫాల్ట్‌గా అందుతుంది. మొబైల్ సబ్‌స్క్రైబర్లు మాత్రం యాడ్ ఆన్ ఆప్షన్ ద్వారా హాలీవుడ్ టైటిల్ కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోగలుగుతారు.
సినిమాలు, వినోద కార్యక్రమాల కంటే స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం జియో హాట్‌స్టార్‌ను ఎక్కువగా సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ 2026ను దృష్టిలో పెట్టుకునే జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ రేట్లను డబుల్ చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఫ్రీగా ఇచ్చి.. ఇప్పుడు డబ్బులు దండుకుంటున్నారని మండిపడుతున్నారు.