కోల్‌కతా: వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి భారీ ఊరట లభించింది. షమీకి దూరంగా ఉంటున్న అతని సతీమణి హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో అలీపూర్ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.2 వేల పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది. మహమ్మద్ షమీతో పాటు అతని సోదరుడు మహమ్మద్ హసీమ్‌కు సైతం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మంగళవారం విచారణ సందర్భంగా తన సోదరుడితో కలిసి షమీ కోర్టుకు హాజరయ్యాడు. షమీ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అనుమతిచ్చింది.

2018లో మహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ అతని సతీమణి హసిన్ జహాన్ పోలీసులను ఆశ్రయించింది. షమీ స్త్రీలోలుడని, ఎంతో మందితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడని హసిన్ జహాన్ ఆరోపించింది. అంతేకాకుండా షమీ కుటుంబ సభ్యులు తనను చిత్రహింసలు పెడుతున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జాదవ్ పూర్ పోలీసులు షమీతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరై బెయిల్ తీసుకోవాలని అప్పట్లో కోర్టు ఆదేశించింది. 2019లో షమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. కోల్‌కతా స్టానిక కోర్టు స్టే విధించింది.
ఈ ఏడాది ఆరంభంలో హసిన్ జహాన్‌కు నెలకు రూ. 50 వేలు హరిహారంగా అందజేయాలని ఆదేశించింది. అదే విధంగా షమీ ఉన్న స్టేను ఎత్తి వేయాలని హసిన్ జహాన్ కోర్టును ఆశ్రయించగా.. షమీ కోర్టుకు హాజరై బెయిల్ తెచ్చుకున్నాడు. ఆసియా కప్ అనంతరం స్వదేశం చేరిన షమీ.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. అనంతరం వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ జరగనుంది.