మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పరిస్థితి. అసలే పేలవ ఆట తీరుతో పతనావస్థకు చేరిన వెస్టిండీస్ క్రికెట్‌కు విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్ బిగ్ షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగే ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లే తన కెరీర్‌లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లని పేర్కొన్నాడు. తన ఇలాకాలో జరిగే రెండు టీ20 మ్యాచ్‌లు ఆడి రిటైర్మెంట్ ప్రకటిస్తానని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సమాచారమిచ్చాడు. అతని నిర్ణయానికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. రిటైర్మెంట్‌పై రస్సెల్ ఓ సుదీర్ఘ పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నాడు.
'వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గర్వించదగ్గ విషయాల్లో ఒకటి. నా చిన్నప్పుడు ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. కానీ మనం ఎంత ఎక్కువగా ఆడితే, ఆటను ప్రేమించడం ప్రారంభిస్తే మనం ఏమి సాధించగలమో గ్రహిస్తాం. నేను మెరూన్ కలర్ జెర్సీలో ఒక ముద్ర వేసి తదుపరి తరానికి ఆదర్శంగా నిలవాలనుకున్నాను.
వెస్టిండీస్ తరఫున ఆడటం నాకు చాలా ఇష్టం. అలాగే నా కుటుంబం, స్నేహితుల సమక్షంలో ఆడటాన్ని కూడా ఇష్టపడుతా. అక్కడే నా సొంత ప్రతిభను ప్రదర్శించడంతో పాటు నాణ్యమైన ప్రదర్శనలు చేయడానికి అవకాశం లభిస్తుంది. కరేబియన్ నుంచి వస్తున్న తదుపరి తరం క్రికెటర్లకు రోల్ మోడల్‌గా ఉంటూనే నా అంతర్జాతీయ కెరీర్‌ను ఉన్నతంగా ముగించాలనుకుంటున్నాను.' అని రస్సెల్ ఒక ప్రకటనలో తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రస్సెల్.. ఫ్రాంచైజీ లీగ్స్‌లో కొనసాగనున్నాడు.

2011లో వెస్టిండీస్ తరఫున టీ20లోకి అడుగుపెట్టిన రస్సెల్.. 2019 నుంచి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అతను వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు 84 టీ20లు ఆడి 22 సగటుతో 1078 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండగా.. బెస్ట్ స్కోర్ 71. బౌలింగ్‌లో 30.59 సగటుతో 61 వికెట్లు పడగొట్టాడు.
2011లోనే వన్డేల్లోకి అరంగేట్రం చేసిన రస్సెల్.. 56 మ్యాచ్‌లు ఆడి 27.21 సగటుతో 1034 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉండగా.. బెస్ట్ స్కోర్ 92 నాటౌట్. 31.84 సగటుతో 70 వికెట్లు తీసాడు. చివరి వన్డేను రస్సెల్..2019లో బంగ్లాదేశ్‌తో ఆడాడు.
వెస్టిండీస్ తరఫున ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడిన రస్సెల్..2 పరుగులు మాత్రమే చేసి ఒక్క వికెట్ తీసాడు. ఫ్రాంచైజీ లీగ్ ప్లేయర్‌గా.. టీ20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన రస్సెల్.. ఇప్పటి వరకు 561 మ్యాచ్‌ల్లో 26.39 సగటు, 168 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో 9,316 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అటు బౌలర్‌గా అతను 25.85 సగటుతో 485 వికెట్లు పడగొట్టాడు.