IPL 2022 సీజన్ ప్రారంభానికి ముందే ఆర్‌సీబీకి ఎదురుదెబ్బ.. ఆరంభ మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. మార్చిలో తన ప్రేయసి వినీ రామన్‌ను మ్యాక్స్‌వెల్ వివాహం చేసుకోనున్నాడు. 9 ఏళ్ల ప్రేమయాణానికి స్వస్తి పలుకుతూ మూడు మూళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నాడు. ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

భారత సంతతకి చెందిన..
ఇక మ్యాక్స్‌వెల్ ఫియాన్సీ వినీ రామన్ భారత సంతతి అన్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఆమె కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడ స్థిరపడింది. ఇక తమిళంలో ఉన్న వీరి వివాహ పత్రిక ఇటీవల నెట్టింటిని షేక్ చేసింది. ఈ పెళ్లి పత్రిక ప్రకారం వచ్చే నెల 27న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి పత్రికను బట్టి చూస్తే వీరి వివాహం తమిళ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరగనుందని అర్థమవుతుంది. మాక్స్‌వెల్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన వాడు కాగా, వినీ రామన్ తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయి. నిజానికి వీరి వివాహం గతేడాదే జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. నిశ్చితార్ధం మాత్రం గతేడాది జరిగింది. భారత సంప్రదాయం ప్రకారం జరిగింది.

ఆర్‌సీబీకి ఎదురు దెబ్బ..
అయితే ఆర్‌సీబీ జట్టులో మ్యాక్స్‌వెల్ కీలక ఆటగాడు. గత సీజన్‌తోనే ఈ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన మ్యాక్సీ.. రెండు దశల్లో జరిగిన ఈ సీజన్‌లో దుమ్మురేపాడు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతన్ని రూ.11 కోట్లకు రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. ఈ సీజన్‌లో సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు కూడా సిద్దమైంది. కానీ వివాహం కారణం అతను ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావాల్సి రావడంతో పునరాలోచనలోపడింది. ఇక మ్యాక్సీ సేవలు కోల్పోతుండటంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్ టూర్‌కు డుమ్మా..
ఐపీఎల్ 2022 సీజన్ కూడా మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మ్యాక్స్‌వెల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తన వివాహం నేపథ్యంలో పాకిస్థాన్ పర్యటనకు దూరంగా ఉంటున్నానని మ్యాక్సీ ప్రకటించాడు. ఏప్రిల్ 5 నుంచి పాకిస్థాన్ గడ్డపై ఆస్ట్రేలియా మూడు టెస్ట్‌లతో పాటు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్, మార్కస్ స్టోయినీస్‌లు కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే చాన్సుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications