భారత్‌తో రెండో వన్డే ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా గాయంతో ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే ఆ జట్టు.. స్టార్ ఆటగాళ్లు అయిన మతీష పతీరణ, దిల్షాన్ మదుషంకల సేవలను కోల్పోగా.. తాజాగా ఆ జాబితాలో హసరంగా చేరాడు.
శుక్రవారం జరిగిన తొలి వన్డేలో హసరంగా అసాధారణ ప్రదర్శనతో భారత్ పతనాన్ని శాసించాడు. మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 24 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమమై మ్యాచ్ టైగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హసరంగా తొడ కండరాలు పట్టేసాయి. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు హసరంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.

కీలక ఆల్‌రౌండర్ అయిన హసరంగా దూరమవ్వడం శ్రీలంకకు తీవ్ర నష్టం చేసే విషయమని ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. తొలి వన్డేలో రెండు వికెట్లను చేతులో పెట్టుకొని ఒక్క పరుగు చేయలేక భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది.
శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ వరుస బంతుల్లో ఔటవ్వడంతో మ్యాచ్ టైగా మారింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే 65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 నాటౌట్), నిస్సాంక (56) అర్ధశతకాలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) తలో రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ ( 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్ ( 57 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్ ( 43 బంతుల్లో, 2 ఫోర్లతో 31), విరాట్ కోహ్లీ ( 32 బంతుల్లో, 2 ఫోర్లతో 24), శ్రేయస్ అయ్యర్ ( 23 బంతుల్లో, 4 ఫోర్లతో 23) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) మూడేసి వికెట్లు తీయగా.. వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటాడు.
ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిబంధన లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ఫలితాన్ని తేల్చలేదు. ఆదివారం జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ జరిగే కొలంబోలో ఉదయం భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఉదయం 10 గంటలకు 50 శాతం వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
అయితే కొలంబో మైదానంలో మంచి డ్రైనేజీ సిస్టమ్ ఉండటం కలిసొచ్చే అంశం. కానీ వర్షం ఆగితేనే ఆటకు మైదానం సిద్దం చేయగలరు. వర్షం అంతరాయం కలిగిస్తే కొన్ని ఓవర్లను కుదించి ఆడిస్తారు. ఆటకు సాధ్యం కాకపోతే మాత్రం రద్దు చేస్తారు. అప్పుడు బుధవారం జరిగే చివరి మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారుతోంది.