
జోహన్నెస్ బర్గ్: భారత్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముందు సౌతాఫ్రికా జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ గాయంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) ధృవీకరించింది. పాత గాయమే తిరగబెట్టడంతో నోర్జ్ ఈ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడని మంగళవారం ట్వీట్ చేసింది. సౌతాఫ్రికా జట్టులో నోర్జ్ టాప్ బౌలర్. ఇటీవల కాలంలో అతను ఎంతో మెరుగయ్యాడు. నిలకడగా వేగమైన బంతులేస్తూ వికెట్లు పడగొట్టే అతని సేవలను కోల్పోవడం సౌతాఫ్రికా జట్టుకు పెద్ద లోటే. ఇక మూడు వన్డేల సిరీస్‌లోపు ఫిట్‌నెస్ సాధిస్తాడా? అనే విషయంపై స్పష్టత లేదు.
ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన అన్రిచ్ నోర్జ్.. 47 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లోను తనదైన బౌలింగ్‌తో సత్తా చాటాడు. ఇక నోర్జ్ ఐపీఎల్ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.5 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.
ఇక అన్రిచ్ నోర్జ్ స్థానంలో మరే ఏ ఆటగాడిని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేయలేదు. నోర్జ్ దూరమైనా కగిసో రబడా, హెన్రీక్స్, గ్లెంటన్, ఓలివర్, సిసాండా, వియాన్ మల్డర్, మార్కో జాన్సెన్ వంటి పేసర్లతో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలంగానే ఉంది. రబడా, ఓలివర్, వియాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక అదనపు పేసర్‌గా ఆల్‌రౌండర్ సిసాండా మగలాకు అవకాశం దక్కవచ్చు. హెన్రీక్స్‌ను కూడా పరిశీలించవచ్చు.
డిసెంబర్ 26-30 వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. జనవరి 3-7 వరకు జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్ట్, జనవరి 11-15 వరకు కేప్‌టౌన్‌లో మూడో టెస్ట్ జరగనుంది. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ముందు షెడ్యూల్ ప్రకారం నాలుగు టీ20 సిరీస్ కూడా జరగాల్సి ఉండగా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేసారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ) ప్రకటించింది. ఆదివారం నుంచి మొదలయ్యే తొలి టెస్టు సహా మున్ముందు జరిగే ఇతర మ్యాచ్‌లకు కూడా అభిమానుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచడం లేదని సీఎస్‌ఏ వెల్లడించింది.