వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఆసీస్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
డబ్ల్యూపీఎల్ 2024లో ఆర్‌సీబీ విజేతగా నిలవడంలో ఎల్లిస్ పెర్రీ కీలక పాత్ర పోషించింది. ఆమె గైర్హాజరీతో జట్టు బలహీన పడనుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెర్రీ స్థానంలో ఆర్‌సీబీ సయాలీ సత్ఘరేను తీసుకుంది. రూ.30 లక్షల కనీస ధరకే ఆమెను జట్టులోకి తెచ్చుకుంది. ఎల్లిస్ పెర్రీ గత కొంత కాలంగా గాయాలతో బాధపడుతుంది. ముఖ్యంగా ఆమె చీలమండ గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది.
కొన్నాళ్లు ఆటకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతోనే ఎల్లిస్ పెర్రీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎల్లీస్ పెర్రీ స్థానాన్ని ఆర్‌సీబీ భర్తీ చేయలేదు. ఆమె బ్యాటింగ్,బౌలింగ్, ఫీల్డింగ్‌లో జట్టుకు వెన్నెముక లాంటిది. ఆమె గైర్హాజరీ టీమ్ కాంబినేషన్‌ను దెబ్బతీయనుంది. డబ్ల్యూపీఎల్ 2024 సీజన్‌లో ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ అందుకుంది. ఒకే మ్యాచ్‌లో 6 వికెట్లు తీసిన రికార్డ్ కూడా నమోదు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అన్నబెలె సదర్లాండ్ కూడా డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమె గైర్హాజరీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తీవ్ర నష్టం చేయనుంది.
అమెరికా ప్లేయర్ తారా నొర్రిస్ కూడా డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ నుంచి తప్పుకుంది. డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ఆమెను యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. అయితే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ నేపథ్యంలో తారా నొర్రిస్ డబ్ల్యూపీఎల్‌కు దూరం కానుంది. ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లు నేపాల్ వేదికగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి.
ఆమె స్థానంలో యూపీ వారియర్స్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చార్లా నాట్‌ను తీసుకుంది. రూ. 10 లక్షలకే ఆమెను జట్టులోకి తెచ్చుకుంది. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనుంది.