ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో శుభారంభం చేసిన టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. పసికూన నమీబియాతో గురువారం ఢిల్లీ వేదికగా జరిగే తమ రెండో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో దుమ్మురేపాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.
విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అతను ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. అమెరికాతో మ్యాచ్‌లోనూ తీవ్ర జ్వరంతో బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ ఫీల్డింగ్‌కు రాలేదు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించలేదు.

అతన్ని టీమిండియా మెడికల్ టీమ్ నిశితంగా పరిశీలిస్తోంది. తీవ్రమైన జ్వరం, లూజ్ మోషన్స్‌తో అభిషేక్ శర్మ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంజూ శాంసన్.. అదనపు సెషన్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నమీబియాతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ అన్ని విధాల సిద్దమయ్యేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చు. మరోవైపు జ్వరంతో తొలి మ్యాచ్ ఆడని జస్‌ప్రీత్ బుమ్రా.. రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ శర్మ ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని బ్యాటింగ్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే మీడియాకు తెలిపాడు. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉందని, ఆ సమయానికి కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పాడు.
సూర్యకుమార్ యాదవ్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. సంజూ, ఇషాన్ కిషన్ కలిసి బ్యాటింగ్ చేశారు. అమెరికాతో మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమవగా.. సూర్యకుమార్ యాదవ్ అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకొని జట్టును గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆట తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ క్రమంలోనే నమీబియాతో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించాలని టీమిండియా భావిస్తోంది.