
న్యూఢిల్లీ: ఎంత అద్భుతంగా రాణిస్తున్నా ఐసీసీ టోర్నీల్లో భారత్ గెలవకపోవడానికి దురదృష్టమే కారణమని టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. ఇక 2013 చాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం భారత్ ఒక్క మెగాటోర్నీ గెలవలేకపోయింది. నాకౌట్ దశకే పరిమితమై తృటిలో టైటిల్ చేజార్చుకుంది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడింది. 2017 చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఫైట్‌లో చేతులెత్తేసింది. ఇక గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది.
తాము టోర్నీ ఆసాంతం రాణిస్తున్న కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో విఫలమయ్యామని, అదే తమ కొంపముంచిందని భువీ చెప్పుకొచ్చాడు. అయితే తమ పరాజయాలకు ఖచ్చితమైన కారణం చెప్పడం కష్టమేనన్నాడు. 'మేం చివరిసారిగా 2013లో చాంపియన్స్ ట్రోఫీ సాధించాం. అప్పటి నుంచి జరిగిన 3-4 ఐసీసీ టోర్నీల్లో 2-3 సార్లు సెమీస్, ఫైనల్లో ఓడాం. 2015 ప్రపంచకప్ సెమీస్ ఆస్ట్రేలియా చేతిలో ఓడాం. 2019లో కూడా అదే సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిన్నాం. మా బ్యాడ్ లక్. కివీస్‌తో టాపార్డర్ వైఫల్యం మా కొంపముంచింది. ప్రత్యర్థిని 250 పరుగులకు కట్టడి చేసిన పరిస్థితుల్లో ఇలా జరగడం చాలా అరుదు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా నోబాల్ వేయడంతో మూల్యం చెల్లించుకున్నాం. ఇక టోర్నీ ఆసాంతం అదరగొట్టి ఇలా కీలక మ్యాచ్‌లో చెతులెత్తేయడం మా దురదృష్టమే.'అని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు.
భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీలా ఉండేందుకు తాను ప్రయత్నిస్తున్నానని భువీ తెలిపాడు. అతనిలా మ్యాచ్ తుది ఫలితం గురించి ఎక్కువగా చింతించకుండా.. మంచి ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టిసారించానన్నాడు. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగడం తన కెరీర్లోనే ఓ కీలక మలుపు అని తెలిపాడు.
'ధోనీలా.. మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించకుండా.. మ్యాచ్‌పై ఏకాగ్రతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. చిన్నచిన్న విషయాలపై దృష్టి పెడుతూ శక్తిమేర రాణించాలనుకుంటున్నా. ఇది ఓ ప్రక్రియ ప్రకారం వస్తుంది. ఐపీఎల్లో రెండు సీజన్లు బాగా రాణించా. ఆ సమయంలో ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించా. తుది ఫలితం తర్వాతి విషయం అనుకున్నా. మొత్తానికి ఫలితాలన్నీ సానుకూలంగానే వచ్చాయి" అని భువనేశ్వర్ చెప్పాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున ఆడడం వల్ల డెత్ ఓవర్లలో తన బౌలింగ్ ఎంతో మెరుగైందన్నాడు.