
కటక్: సౌతాఫ్రికాతో తొలి టీ20 ఓటమికి తాత్కలిక సారథి రిషభ్ పంత్‌ను నిందించాల్సిన అవసరం లేదని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. బౌలింగ్ వైఫల్యమే జట్టు ఓటమికి కారణమైందని, కానీ ఆరోజు తమకు కలిసిరాలేదన్నాడు. రిషభ్ పంత్ యువ క్రికెటరని, తాను సిరీస్ సాగుతున్నా కొద్దీ నేర్చుకుంటాడని చెప్పాడు. ఇక ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ రెండో మ్యాచ్ నేడు కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భువీ.. పంత్‌ను వెనకేసుకొచ్చాడు.
'రిషభ్ పంత్ కుర్రాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20.. కెప్టెన్‌గా అతనికి ఫస్ట్ మ్యాచ్. సిరీస్ సాగుతున్నకొద్దీ రిషభ్ మెరుగవుతాడని భావిస్తున్నా.
సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత్ బౌలర్లు అందరూ విఫలమయ్యారు. ఒకవేళ బౌలర్లు రాణించి ఉంటే పంత్ నిర్ణయాలను మెచ్చుకునేవాళ్లే. అతను భవిష్యత్‌లో కెప్టెన్‌గా సత్తా చాటుతాడు. బౌలింగ్ వైఫల్యంపై మరీ ఎక్కువగా చర్చించుకోలేదు. ఎందుకంటే ఏ జట్టుకైనా కలిసిరాని రోజు ఒకటి ఉంటుంది. రెండో టీ20లో పుంజుకోవడం ముఖ్యం. మేమంతా ఐపీఎల్ తర్వాత ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ అదే. ఎలా మెరుగు పడాలో ప్రతి ఒక్కరికి తెలుసు. రెండో టీ20లో బౌలింగ్‌లో సత్తా చాటి సిరీస్ సమం చేస్తాం' అని భువనేశ్వర్ ధీమా వ్యక్తం చేశాడు.
తొలి టీ20లో భువనేశ్వర్ కుమార్‌తో పాటు ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, చాహల్, అక్షర్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. వికెట్లు తీసినా కట్టడిగా బౌలింగ్ చేయలేకపోయారు. ఇక రిషభ్ పంత్.. చాహల్‌తో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించలేదు. దాంతో అతని కెప్టెన్సీ తీరును మాజీ క్రికెటర్లు, నెటిజన్లు తప్పుబట్టారు. ఈ క్రమంలోనే బౌలింగ్ విభాగంలో పలు మార్పులు చేసే యోచనలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అర్షదీప్ సింగ్ లేదా ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించే అవకాశం ఉంది.