ఫిట్‌నెస్ లేక ఐదేళ్ల క్రితమే.. మహమ్మద్ షమీ రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడు: మాజీ బౌలింగ్ కోచ్

న్యూఢిల్లీ: ఫిట్‌నెస్ సమస్యలతో ఐదేళ్ల క్రితమే మహమ్మద్ షమీ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావించాడని టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. నాటి టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి కలుగ జేసుకొని మద్దతుగా నిలవడంతో షమీ స్టార్ పేసర్‌గా కెరీర్ కొనసాగిస్తున్నాడని వెల్లడించాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న షమీ.. నేలకు కొట్టిన బంతిలా కెరీర్‌లో పుంజుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టెస్ట్‌లోనూ బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షమీ గురించి భరత్ అరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'2018లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ టెస్టులో విఫలమయ్యాడు. దాంతో అతను జట్టులో స్థానం కోల్పోయాడు. అప్పుడు నాతో మాట్లాడాలని ఉందని చెప్పాడు. నా గదికి రమ్మని ఆహ్వానించా. వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డాడు. ఫిట్‌నెస్‌పరంగానూ ప్రభావితుడయ్యాడు. మానసికంగా కాస్త కుంగుబాటుకు గురైనట్లు అనిపించింది.
'నాకు చాలా అసహనంగా, కోపంగా ఉంది. అందుకే నేను క్రికెట్ నుంచి వైదొలుగుదామని అనుకుంటున్నా' అని షమీ నాతో చెప్పాడు. నేను వెంటనే అతన్ని అప్పటి టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి దగ్గరకు తీసుకెళ్లా. 'రవి.. షమీ ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు' అని అన్నా. అప్పుడు ఏంటని రవి అడగగానే.. నాతో షమీ ఏం చెప్పాడో అదే మళ్లీ చెప్పేశాడు. 'మరి నువ్వేం చేస్తావు? బౌలింగ్ చేయడం తప్ప నీకేం తెలుసు..?' అని మేం అన్నాం''
'నువ్వు కోపంగా ఉండటంలో అర్థముంది. నీ చేతిలో బంతి ఉన్నప్పుడు ఇదే విధంగా ప్రవర్తించాలి. నువ్వు ఫిట్‌నెస్‌లో పూర్. ఇప్పుడు నీ దగ్గర ఉన్న కోపాన్ని నీ శరీరంలో నుంచి తీసేయ్. నిన్ను నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపుతాం. అక్కడే నాలుగు వారాలు ఉండు. ఇంటికి వెళ్లొద్దు' అని రవిశాస్త్రి చెప్పడంతో షమీ ఎన్‌సీఏకి వెళ్లిపోయాడు. దాదాపు ఐదు వారాల తర్వాత వచ్చిన షమీ 'సర్, నేను గుర్రం మాదిరిగా తిరిగి వచ్చా. ఇప్పుడు మీరు ఎంత దూరం పరుగెత్తమంటే అంత దూరం రన్ చేస్తా' అని నమ్మకంగా చెప్పాడు. ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడంతోనే ఇదంతా సాధ్యమైంది'' అని భరత్ అరుణ్ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో ఆసీస్‌పై తొలి టెస్టు మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి షమీ అదరగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications