భారత్‌తో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయినా.. తలెత్తుకునేలా ఆడామని బెన్ స్టోక్స్ తెలిపాడు. ఈ సిరీస్‌లో తమకు ఆశించిన ఫలితం రాకపోయినా.. జట్టుగా ఎన్నో సానుకూలంశాలు లభించాయని, తమ ఆట తీరులో ఎంతో పురోగతి సాధించామని అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా జరుగుతున్న ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 1-3తో సిరీస్ కోల్పోయింది.
ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ధర్మశాల వేదికగా చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బ్రిటీష్ మీడియాతో మాట్లాడిన బెన్ స్టోక్స్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది ఆటగాళ్లు ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేశారని చెప్పాడు. 'ఈ సిరీస్‌ను 3-1తో కోల్పోయినంత మాత్రానా మేం వెనుకంజలో నిలిచినట్లు కాదు.

ఈ సిరీస్‌లో మాకు అనేక సానుకూలాంశాలు లభించాయి. ఒక జట్టుగా మా ఆట తీరులో ఎంతో పురోగతి సాధించాం. ఈ పర్యటనలో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు జట్టు సమష్టితత్వం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతీ ఒక్కరు తమను తాము మెరుగుపరుచుకున్నారు. చాలా మంది ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు.
ప్రతీ ఆటగాడు కూడా చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఈ వేసవికి ముందు మా జట్టు ఆటతీరు భిన్నమైన అనుభూతిని ఇస్తోంది.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
జానీ బెయిర్ స్టో 100వ టెస్ట్ నేపథ్యంలో అతనిపై బెన్ స్టోక్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచ్ చూసేందుకు అతని కుటుంబం మొత్తం ధర్మశాలకు వస్తుందని తెలిపాడు.
'ఈ 100వ టెస్ట్ ఎన్నడూ లేని విధంగా జానీ బెయిర్ స్టోకు చాలా ఎమోషనల్ మ్యాచ్‌గా నిలవనుంది. అతని కుటుంబం మొత్తం ఈ మ్యాచ్ చూసేందుకు వస్తోంది. అతని తల్లి, సోదరి, సతీమణి, కుమారుడు, స్నేహితులు ఈ మ్యాచ్‌కు హాజరవుతున్నారు. జానీ బెయిర్ స్టోపై వస్తున్న ప్రశంసలకు అతను పూర్తిగా అర్హుడు. అసాధారణ ప్రదర్శనతో అరుదైన ఘనతను అందుకునేందుకు సిద్దమయ్యాడు.'అని బెన్ స్టోక్స్ తెలిపాడు.
ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో విజయం సాధించి శుభారంభం చేసిన ఇంగ్లండ్.. అనంతరం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్ షోయబ్ బషీర్, టామ్ హార్ట్‌లీ వంటి యువ స్పిన్నర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. హైదరాబాద్ టెస్ట్ చివరి ఇన్నింగ్స్‌లో టామ్ హార్ట్‌లీ 7 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు.
ధర్మశాల టెస్ట్‌లో బెయిర్ స్టోతో పాటు అశ్విన్ కూడా 100 టెస్ట్ మ్యాచ్‌ల మైలురాయిని అందుకోనున్నాడు. ఇంగ్లండ్ తరఫున ఈ ఫీట్ సాధించనున్న 17వ ప్లేయర్ బెయిర్ స్టో కాగా.. అశ్విన్ 14వ భారత ఆటగాడు. సంయుక్తంగా ఒకే మ్యాచ్‌లో 100 మ్యాచ్‌ల ఘనతను అందుకున్న మూడో జోడిగా అశ్విన్-బెయిర్ స్టోలు నిలవనున్నారు.