టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ డేంజరస్ బ్యాటరని, రెండు ఇన్నింగ్స్‌ల్లో అతన్ని త్వరగా ఔట్ చేయడంతోనే విజయం సాధించామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. రిషభ్ పంత్ రనౌట్ ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా పేర్కొన్నాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఆఖరి సెషన్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఆఖరి వరకు రవీంద్ర జడేజా(181 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 61 నాటౌట్) చేసిన పోరాటం వృథా అయ్యింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన బెన్ స్టోక్స్.. ఇదో గొప్ప విజయమని తెలిపాడు. జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్‌తో తమ విజయంలో కీలక పాత్ర పోషించాడన్నాడు. 'ఇదో గొప్ప విజయం. సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇక్కడే 2019 వన్డే ప్రపంచకప్ గెలిచాం. ఆ మ్యాచ్‌లోనూ జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. అందుకే ఈ రోజు ఉదయం జోఫ్రా ఆర్చర్‌తో పాటు నేను బౌలింగ్ చేశాను. ఆర్చర్ ఏదో ప్రత్యేకమైనదని చేస్తాడని నాకు అనిపించింది. నేను ఊహించినట్లుగానే రెండు కీలకమైన వికెట్లతో మ్యాచ్‌ను మావైపు మలుపు తిప్పాడు.

జోఫ్రా ఆర్చర్‌తో ఫస్ట్ స్పెల్ వేయించడం వెనుక డ్రెస్సింగ్ రూమ్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. నిన్న(నాలుగో రోజు ఆట) బ్రైడన్ కార్స్ అద్భుతమైన స్పెల్ వేసాడు. మంచి రిథమ్‌తో దూకుడుగా బౌలింగ్ చేశాడు. కానీ జోఫ్రా ఆర్చర్‌కు బంతినివ్వాలని నా మనసుకు అనిపించింది. రీఎంట్రీలో తొలి మ్యాచ్ ఆడుతున్న అతను అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడని అనిపించింది. దేశం కోసం టెస్ట్ మ్యాచ్ గెలవడం కంటే మించినది ఏది లేదనే మనస్థత్వంతో బౌలింగ్ చేశాను. షోయబ్ బషీర్ గాయంతోనే బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేసి ఆఖరి వికెట్ పడగొట్టాడు. అతను ఓ ఫైటర్.
నిన్నటి కంటే ఈ రోజు ఆట కాస్త భిన్నంగా సాగింది. నిన్న ఎక్కువ సేపు మైదానంలో ఉండాల్సి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నేను అలసిపోయాను. కానీ ఆట నన్ను ఆడేలా చేసింది. ఆల్‌రౌండర్‌గా మ్యాచ్‌పై ప్రభావం చూపేందుకు నాకు నాలుగు అవకాశాలు ఉంటాయి. ఆల్‌రౌండర్లకు కలిసొచ్చే గొప్ప విషయం ఇది. ఒక విభాగంలో రాణించకపోతే.. మరో విభాగంలో అవకాశం ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో నేను కీలకమైన స్పెల్ వేసాను. నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. రిషభ్ పంత్‌ను రనౌట్ చేయడం ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. ఎక్స్‌ట్రా కవర్ ఫీల్డింగ్ పొజిషన్ చాలా కీలకమైనది. అందుకే నేను అక్కడ నిలబడ్డాను. రిషభ్ పంత్ పరుగు తీయడంలో తడబడటం నాకు కనిపించింది. వెంటనే బంతిని అందుకొని రనౌట్ చేశాను. అది మ్యాచ్‌ను మలుపు తిప్పింది. రిషభ్ పంత్ అద్భుతంగా ఆడాడు. అతను ఎంత డేంజరస్ బ్యాటరో మాకు తెలుసు. ఈ ఉదయం అతన్ని జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు. అతను త్వరగా ఔటవ్వడం మాకు కలిసొచ్చింది. రెండు అద్భుతమైన జట్లు తలపడినప్పుడు మ్యాచ్‌లు ఇలానే ఉంటాయి. నువ్వా-నేనా అన్నట్లు ఈ మ్యాచ్ సాగింది. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొని తదుపరి టెస్ట్‌కు సిద్దమవుతాం.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.