
వెల్లింగ్టన్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ జెమ్స్ స్టోక్స్ మంగళవారం మరణించిన విషయం తెలిసిందే. 65 ఏళ్ల గెరార్డ్.. కొంతకాలంగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన వర్కింగ్టన్ టౌన్ క్లబ్ తరఫున ఆయన రగ్బీ ఆడారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న స్టోక్స్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ట్విటర్ వేదికగా తన తండ్రిని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
'ప్రస్తుతం మనమిద్దరం వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నాం గెడ్.. కానీ మీ ముఖ్యం ఎప్పుడూ చిరునవ్వు ఉంటుందని తెలుసు. నేను మీ గురించి ఆలోచించిన ప్రతీ సారి నా ముఖంలో కూడా చిరునవ్వు వస్తుంది. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ యూ'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. కరోనా కేసుల కారణంగా సఫారీలతో జరగాల్సిన వన్డే సిరీస్ రద్దు కావడంతో.. ఇంగ్లండ్ జట్టు గురువారం స్వదేశానికి బయల్దేరనుంది.
న్యూజిలాండ్‌కు చెందిన గెరార్డ్ స్టోక్స్.. ఇంగ్లండ్‌లో రగ్భీ కోచ్‌గా పనిచేసారు. దాంతో కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. అప్పుడు బెన్‌కు 12 ఏళ్లు. ఇక 2013లో న్యూజిలాండ్‌కు తిరిగిరాగా.. అదే ఏడాది బెన్.. ఇంగ్లండ్ తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తండ్రి అనారోగ్యం కారణంగానే స్టోక్స్ పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. తండ్రికి అండగా ఉండేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. ఆ తర్వాత ఐపీఎల్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తన తండ్రి ప్రోత్సాహంతోనే ఐపీఎల్ ఆడడానికి వచ్చినట్టు స్టోక్స్ అప్పట్లో చెప్పుకొచ్చాడు.
రగ్బీ ఆడుతూ గాయపడ్డ స్టోక్స్ తండ్రి చికిత్సకు డబ్బులు లేక ఆటను కొనసాగించడం కోసం మిడిల్ ఫింగర్‌ను కట్ చేసుకున్నాడు. అందుకే సెంచరీ చేసిన ప్రతీ సారి స్టోక్స్ తన మిడిల్ ఫింగర్‌ను మలచి సంబరాలు చేసుకుంటాడు.