ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ఓ టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతతో పాటు హాఫ్ సెంచరీ నమోదు చేసిన మూడో ఇంగ్లండ్ కెప్టెన్‌గా నిలిచాడు. భారత్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో బెన్ స్టోక్స్ ఈ ఫీట్ సాధించాడు. బౌలింగ్‌లో(5/72) ఐదు వికెట్లు తీసిన బెన్ స్టోక్స్.. బ్యాటింగ్‌లో (77 నాటౌట్) శతకం దిశగా సాగుతున్నాడు.
గత 89 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ నిలిచాడు. బెన్ స్టోక్స్ కంటే ముందు స్టాన్‌లీ జాక్సన్, గబ్బీ అలెన్ ఈ ఫీట్ సాధించారు. 1905లో నాటింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా స్టాన్‌లీ జాక్సన్ 82 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు ఐదు వికెట్ల (5/58) ఘనత అందుకున్నాడు. 1936లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గబ్బీ అలెన్ సారథిగా 68 పరుగులు చేయడంతో పాటు 5/36 ఐదు వికెట్లు పడగొట్టాడు. తాజాగా బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు బిగించింది. జోరూట్(248 బంతుల్లో 14 ఫోర్లతో 150) భారీ శతకంతో పాటు ఓలీ పోప్(128 బంతుల్లో 7 ఫోర్లతో 71), బెన్ స్టోక్స్(134 బంతుల్లో 6 ఫోర్లతో 77 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 135 ఓవర్లలో 7 వికెట్లకు 544 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్, బమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.ఇంగ్లండ్ ఆధిక్యం ఇప్పటికే 186 పరుగులు చేరింది. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయవకాశాలు సన్నగిల్లాయి. డ్రా చేసుకోవడం మినహా భారత జట్టు ముందు మరో ఆప్షన్ లేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీసారు.