భారత్‌తో నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. జోరూట్(248 బంతుల్లో 14 ఫోర్లతో 150) భారీ శతకంతో పాటు ఓలీ పోప్(128 బంతుల్లో 7 ఫోర్లతో 71), బెన్ స్టోక్స్(134 బంతుల్లో 6 ఫోర్లతో 77 బ్యాటింగ్) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 135 ఓవర్లలో 7 వికెట్లకు 544 పరుగులు చేసింది. క్రీజులో బెన్ స్టోక్స్‌తో పాటు లియామ్ డాసన్(21 బ్యాటింగ్) ఉన్నాడు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్, బమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.ఇంగ్లండ్ ఆధిక్యం ఇప్పటికే 186 పరుగులు చేరింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయవకాశాలు సన్నగిల్లాయి. డ్రా చేసుకోవడం మినహా భారత జట్టు ముందు మరో ఆప్షన్ లేదు.
225/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఓవర్‌నైట్ బ్యాటర్లు ఓలీ పోప్, జోరూట్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ.. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో ఓలీ పోప్ 93 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. జోరూట్ 99 బంతుల్లో అర్థశతకాన్ని సాధించాడు. ఈ జోడీని విడదీసేందుకు శుభ్‌మన్ గిల్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో ఇంగ్లండ్ 332/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రెండో సెషన్ ఆరంభంలో వాషింగ్టన్ సుందర్‌కు బంతిని అందించిన శుభ్‌మన్ గిల్..ఆశించిన ఫలితాన్ని అందించాడు. ఓలీ పోప్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన సుందర్.. నాలుగో వికెట్‌కు నమోదైన 144 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ వెంటనే డేంజరస్ హ్యారీ బ్రూక్(3)ను స్టంపౌట్ చేశాడు. అప్పటికే 80 ఓవర్లు పూర్తవ్వడంతో భారత్ కొత్త బంతిని తీసుకుంది. బెన్ స్టోక్స్‌తో జత కలిసిన జోరూట్.. తన జోరును కొనసాగించాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ పరుగుల మోత మోగించాడు. అన్షూల్ కంబోజ్ వేసిన 96వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన జో రూట్ 178 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు స్టోక్స్ కూడా అతనికి అండగా నిలవడంతో ఇంగ్లండ్ 433/4 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
ఆఖరి సెషన్‌లోనూ ఇంగ్లండ్ తన దూకుడు కొనసాగించింది. స్టోక్స్ 97 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతనికి క్రాంప్స్ రావడంతో 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వెనుదిరిగాడు. క్రీజులోకి జెమీ స్మిత్ రాగా.. జోరూట్ 246 బంతుల్లో 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. జోరూట్‌ను జడేజా స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చగా.. స్మిత్‌ను బుమ్రా కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. దాంతో స్టోక్స్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. క్రిస్ వోక్స్‌ను సిరాజ్ ఔట్ చేయగా.. లియామ్ డాసన్‌తో కలిసి స్టోక్స్ ఆచితూచి ఆడాడు. మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించాడు.