ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బెన్ కట్టింగ్ పేరును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులు అస్సలు మరిచిపోరు. ఐపీఎల్ 2016 ఫైనల్‌ను ఆర్‌సీబీ అభిమానులకు ఈ ఆసీస్ ఆటగాడు పీడకలగా మిగిల్చాడు. ఆ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన బెన్ కట్టింగ్.. బెంగళూరు వేదికగా ఆర్‌సీబీ జరిగిన ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆరెంజ్ ఆర్మీకి టైటిల్ అందించాడు.
చివర్లో బ్యాటింగ్ వచ్చి కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసిన బెన్ కట్టింగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించాడు. ఆ తర్వాత డేంజరస్ క్రిస్ గేల్‌తో పాటు కేఎల్ రాహుల్‌లను ఔట్ చేసి ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇప్పటికీ 150 మెసేజ్‌లు..
తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన బెన్ కట్టింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బెంగళూరులోని ఆ రాత్రిని అస్సలు మరిచిపోలేనని తెలిపాడు. తాను మర్చిపోదామనుకున్న అభిమానులు రోజు వందల మెసేజ్‌లతో గుర్తు చేస్తారని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఆర్‌సీబీకి వ్యతిరేకంగా ఇతర జట్లలోకి రిప్లేస్‌మెంట్‌గా రావాలని రోజుకు 150 మెసేజ్‌లు వస్తున్నాయని చెప్పాడు.
'నేను నా ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను చూస్తే, ప్రతిరోజూ 150 మెసేజ్‌లు ఉంటాయి, అందులో 'RCBకి వ్యతిరేకంగా వచ్చే ఏ జట్టుకైనా ఐపీఎల్‌లో రీప్లేస్‌మెంట్‌గా అందుబాటులో ఉండగలవా?' అని అభిమానులు ప్రశ్నిస్తుంటారు'అని బెన్ కట్టింగ్ చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తన ప్రయాణాన్ని ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పాడు.
రియల్టర్‌గా రెండో ఇన్నింగ్స్..
ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్న బెన్ కట్టింగ్.. వెన్నెముకకు వరుసగా తీవ్రమైన గాయాలు కావడంతో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. చివరిసారిగా అతను ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో కనిపించాడు. ప్రస్తుతం అతను రియల్ ఎస్టేట్‌లో తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తన వ్యాపార సంస్థకు గోల్కొండ ప్రాపర్టీ గ్రూప్ అని పేరు పెట్టాడు. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటకు గుర్తుగా ఈ పేరు పెట్టానని బెన్ కట్టింగ్ వెల్లడించాడు.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్(2014), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2016-2017), ముంబై ఇండియన్స్ (2018-2019), కోల్‌కతా నైట్ రైడర్స్ (2021) జట్లకు ప్రాతినిధ్యం వహించిన బెన్ కట్టింగ్.. మొత్తం 21 మ్యాచ్‌లు ఆడి 238 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 10 వికెట్లు తీసాడు. 2016 సీజన్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.