పాక్‌కు వెళ్లం..
ముంబైలో మంగళవారం జరిగిన బీసీసీఐ 91వ వార్షిక సమావేశం అనంతరం జై షా మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఆసియాకప్ పాకిస్థాన్‌లో కాకుండా తటస్థవేదికపై నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపాడు. ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌గా ఉన్న జై షా ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. ఏసీసీ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యలతో పాక్‌లో ఈ టోర్నీ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ అంశంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది. 'ఆసియా కప్ తటస్థ వేదికపై జరుగుతుంది. నేను ఏసీసీ అధ్యక్షుడిగా ఈ మాట చెబుతున్నా. మేము అక్కడికి వెళ్లము. వారు ఇక్కడికి రారు. గతంలో కూడా ఆసియాకప్‌లు తటస్థ వేదికలపైనే నిర్వహించాం'అని జైషా పేర్కొన్నారు.
వన్డే ప్రపంచకప్ బాయ్‌కట్ చేయాలి.
జై షా వ్యాఖ్యలను పాకిస్థాన్ అభిమానులు తప్పుబడుతున్నారు. ఏసీసీ అధ్యక్ష హోదాలో ఉండి ఒక దేశం తరఫునే మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. బీసీసీఐ పైస పలుకుబడి చూపిస్తోందని, పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను తొక్కెయ్యాలనుకుంటుందని మండిపడుతున్నారు. పీసీబీ సైతం ధీటుగా సమాధానం ఇవ్వాలని రమీజ్ రాజాకు సూచిస్తున్నారు. భారత్ వేదికగా జరిగే 2023 వన్డే ప్రపంచకప్‌ను పాకిస్థాన్ భాయ్‌కట్ చేయాలని సూచిస్తున్నారు. అప్పుడు బీసీసీఐ, ఐసీసీకి భారీ నష్టం వాటిల్లుతుందని, పాకిస్థాన్ లేకుండా టోర్నీని ఎలా నిర్వహిస్తారో చూద్దామని కామెంట్ చేస్తున్నారు.
పీసీబీకే బొక్క..
అయితే కొందరు క్రికెట్ విశ్లేషకులు మాత్రం బీసీసీఐకి వచ్చే నష్టం ఏం లేదని, పీసీబీనే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ బాయ్‌కట్ చేస్తే.. పీసీబీపై ఐసీసీ కన్నెర్ర చేస్తుందని, బ్లాక్ లిస్ట్‌లో పెట్టి ఇచ్చే నిధులను ఆపేస్తుందని చెబుతున్నారు. తద్వారా పీసీబీకే నష్టం వాటిల్లుతుందని, ఈ వ్యవహారంపై ఆచితూచి అడుగెయ్యాలంటున్నారు. ఐసీసీ ఎన్నికల్లో బీసీసీఐ ఆధిపత్యమే నడుస్తోందని, ఆ బోర్డుకు చెందినవారే అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నాయని, అప్పుడు పీసీబీ బెదిరింపు నడవవని హితవు పలుకుతున్నారు.
రాజకీయ కారణాలతో..
ఇక భారత్ చివరి సారిగా 2006లో పాక్‌లో పర్యటించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో 2012-13 నుంచి భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. ప్రపంచ స్థాయి టోర్నీలు, ఆసియాకప్‌ల్లో మాత్రమే పరస్పరం తలపడుతన్నాయి. భారత్-పాక్‌లు చివరి సారిగా యూఏఈలో 2022 టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్‌లో తలపడ్డాయి. ఈ నెల 23న టీ20 ప్రపంచ కప్‌లో కూడా మరోసారి దాయాదుల పోరు జరగనుంది. నేడు ముంబయిలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రోజర్ బిన్నీని బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు. బిన్నీ ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జైషా కార్యదర్శిగా మరోసారి కొనసాగనున్నారు.


Click it and Unblock the Notifications
