BCCI: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 20 మ్యాచ్‌లతో కూడిన తొలి దశ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా మిగిలిన 50 మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్ వచ్చినట్లైంది. మార్చి 28 నుంచి మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా.. మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది.అయితే ప్లేఆఫ్స్ వేదికలను ఇంకా ఖరారు చేయలేదు.
శనివారం(మార్చి 28) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరలేవనున్న సంగతి తెలిసిందే.

తాజాగా బీసీసీఐ ప్రకటించిన సెకండాఫ్ షెడ్యూల్‌లో 12 వేదికల్లో మొత్తం 50 మ్యాచ్‌లు జరగనుండగా.. ఇందులో 8 డబుల్ హెడర్స్ ఉన్నాయి. డబుల్ హెడర్స్ ఉన్న రోజున మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక మ్యాచ్, రాత్రి 7:30 గంటలకు రెండో మ్యాచ్ మొదలవుతుంది.

సెకండాఫ్ షెడ్యూల్‌లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. మొత్తంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, న్యూ చండీగఢ్, రాయ్‌పూర్ వేదికల్లో ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు జరగనున్నాయి.
బుధవారం జరిగిన కెప్టెన్ల సమావేశంలో క్యాచ్‌లపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలను ప్లే చేసి 10 ఫ్రాంచైజీల కెప్టెన్లకు వివరించినట్లు సమాచారం క్లాజ్ 33.3 ప్రకారం బంతిపై ఫీల్డర్‌కు పూర్తి నియంత్రణ వచ్చినట్లు అంపైర్లు భావిస్తేనే ఔట్ ఇవ్వడం జరుగుతుందని బీసీసీఐ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకోసం గత టీ20 ప్రపంచ కప్‌లో కాస్త చర్చకు దారితీసిన క్యాచుల వీడియోలను ప్రదర్శించినట్లు వార్తలు వస్తున్నాయి.
