సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ బుధవారం వెల్లడించింది. మెడ నొప్పితో సౌతాఫ్రికాతో టెస్ట్, వన్డే సిరీస్‌లకు దూరమైన శుభ్‌మన్ గిల్ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే అతను ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకున్న హార్దిక్ పాండ్యాకు కూడా అవకాశం దక్కింది.
టీ20 సెన్సేషన్ రింకూ సింగ్‌తో పాటు నితీష్‌కుమార్ రెడ్డిపై వేటు పడింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

డిసెంబర్ 9న కటక్ వేదికగా జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు తెరలేవనుంది. డిసెంబర్ 11న ముల్లాన్ పూర్ వేదికగా రెండో టీ20, డిసెంబర్ 14న ధర్మశాల వేదికగా మూడో టీ20, డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20, డిసెంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఐదో టీ20 జరగనుంది.
టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా ఆడే కీలక సిరీస్ ఇదే కావడంతో ఈ జట్టే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో రాణించే ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌కు ఎంపికవ్వనున్నారు.