
బీసీసీఐ చూసుకుంటుంది..
టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని విరాట్‌ను రిక్వెస్ట్ చేశామంటూ అంతకుముందు బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో బీసీసీఐ పెద్దలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.అంతేకాకుండా బోర్డు, విరాట్ మధ్య అసలేం జరుగుతోందనే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో తన హోమ్ టౌన్ కోల్‌కతాలో గురువారం మీడియా ఎదుటపడిన దాదా.. ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించాడు.
'ఎలాంటి ప్రకటన చేసేది లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు లేవు. మేమే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. విషయాన్ని బీసీసీఐకి వదిలేయండి' అంటూ వెళ్లిపోయాడు. దాంతో, విరాట్, బీసీసీఐ మధ్య మొదలైన వార్ ఎలా ముగుస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ టెన్షన్‌లో ఉన్నారు.

ఆచితూచి వ్యవహరించాలని...
కోహ్లీ విషయంలో బీసీసీఐ కొంత సమయం వేచి చూడాలనుకుంటుంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇప్పుడే ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది టీమ్, ప్లేయర్ల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తుందని, దానివల్ల సమస్య మరింత పెద్దది అవుతుందని భావిస్తోంది. అందుకే కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించడానికి గంగూలీ నిరాకరించాడట. టీమిండియా స్టార్ కెప్టెన్... ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఓ దిగ్గజ కెప్టెన్ వ్యాఖ్యలతో విభేదించిన సందర్భాలు గతంలో లేవు. దాంతో, కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత బీసీసీఐ పెద్దలంతా అతనిపై గుర్రుగా ఉన్నారట. కానీ, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే అది బెడిసికొడుతుందేమోనని భయపడుతున్నారట.
ఈ విషయంలో గంగూలీ, సెక్రటరీ జైషా సహా బీసీసీఐ పెద్దలంతా బుధవారమే జూమ్ కాల్‌లో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. కోహ్లీ గురించి ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దని, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దని అంతా మూకుమ్మడిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

విరాట్ రూల్స్ అతిక్రమించాడా?
సాధారణంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు.. బోర్డు గురించి, ఆఫీస్ బేరర్ల గురించి విమర్శలు చేయకూడదు. కానీ, కోహ్లీ తనకు తానుగా ప్రకటన చేయకుండా.. మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగానే అసలు ఏం జరిగిందనే దానిపై వివరణ ఇచ్చాడు. ఇది ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసినట్టు అవుతుందా? అనే ప్రశ్న వస్తోంది. కోహ్లీ స్టేట్‌మెంట్స్‌ను పరిశీలిస్తే కెప్టెన్సీ తీసేయడంపై అతనెక్కడా అధికారిక అసంతృప్తి వ్యక్తం చేయలేదు. షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. కోహ్లీ ఇదే వివరించనున్నాడు.

పంతాలకు పోకుండా..?
కాబట్టి ఈ సమస్యకు అంత ఈజీగా పరిష్కారం దొరికేలా లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు కెప్టెన్ల (కోహ్లీ, రోహిత్) మధ్య అభిప్రాయబేధాలుగా మొదలై, కెప్టెన్ వర్సెస్ బోర్డుగా మారిన ఈ ఇష్యూ సుదీర్ఘంగా సాగుతున్న చెస్ గేమ్‌లా కనిపిస్తోంది. తన కెప్టెన్సీ తీసేసిన సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని కోహ్లీ చెప్పిన నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు కూడా కాస్త తగ్గి ఈ గేమ్‌ను గౌరవంగా డ్రా చేసుకుంటేనే భారత క్రికెట్ గెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మరి గంగూలీ- జై షా ఏం చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications
