రంజీ ట్రోఫీలు ఆడకుండా ఐపీఎల్ 2024 కోసం సన్నదమవుతున్న భారత ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌ను లెక్కచేయకుండా ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైన ఆటగాళ్లకు నోటిసులు ఇచ్చేందుకు కూడా బోర్డు సిద్దమైనట్లు సమాచారం.
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన ఆటగాళ్లు.. జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పుడు రంజీ క్రికెట్ ఆడాలని బోర్డు ఆదేశించనుంది. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతూ ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నావారికి మాత్రమే మినహాయింపు ఇవ్వనుంది. మిగతా ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ టోర్నీలు ఆడాలని సూచించనుంది.

'మరో రెండు, మూడు రోజుల్లో రంజీ ట్రోఫీ ఆడే విషయంపై ఆటగాళ్లందరికి బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనుంది. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లంతా తప్పనిసరిగా రంజీ క్రికెట్ ఆడాలని, గాయాలతో ఆడేవారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పనుంది. దేశవాళీ క్రికెట్‌ను పక్కనపెట్టి ఐపీఎల్ సన్నాహకాలను ప్రారంభించిన ఆటగాళ్లపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు.
ముఖ్యంగా ఇషాన్ కిషన్ తీరుపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోని వారికి నోటీసులు ఇవ్వనుందని, బోర్డు సూచనలను దిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా బీసీసీఐ వెనుకాడదని ప్రచారం జరుగుతోంది. మానసిక సమస్యలంటూ జట్టు నుంచి తప్పుకున్న ఇషాన్ కిషన్.. రంజీ ట్రోఫీ ఆడకుండా ఐపీఎల్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు.
బరోడా ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన సూచనలను కూడా ఇషాన్ కిషన్ పట్టించుకోలేదు. ఇషాన్ అటిట్యూడ్ పట్ల బోర్డు చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఇషాన్ కిషన్‌కు పడటం లేదనే ప్రచారం జరుగుతోంది. తనకు బదులు ఇషాన్ కిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై బోర్డు ఆగ్రహంగా ఉన్నట్లు సమచారం.