టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వేటు పడనుందా? అతని పనితీరుపై ఆగ్రహంగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) డెడ్‌లైన్ విధించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అప్‌కమింగ్ ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పైనే హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ భవితవ్యం ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ టోర్నీలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తేనే గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఆసీస్ పర్యటన తరహాలో విఫలమైతే మాత్రం గంభీర్‌పై బీసీసీఐ వేటు వేయనుందని సమాచారం. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరాజయం అనంతరం గంభీర్ చేసిన వ్యాఖ్యలే ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నాయి.

గంభీర్ మాటలతో..
టీమిండియా సీనియర్ క్రికెటర్ల రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా.. వారి భవితవ్యం గురించి మాట్లాడేందుకు గంభీర్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఐదు నెలల తర్వాత టీమిండియాకు టెస్ట్ సిరీస్ ఉందని, అప్పటి వరకు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదని, జట్టు ట్రాన్సిషన్ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని చెప్పాడు.
ఈ వ్యాఖ్యలతో గంభీర్ హెడ్ కోచ్ పదవికి కూడా గ్యారెంటీ లేదనే విషయం అర్థమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గంభీర్‌కు డెడ్‌లైన్‌గా విధించారనే సందేహం కలుగుతోంది.
గంభీర్ రాకతో గతి తప్పిన టీమిండియా..
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రాహుల్ ద్రవిడ్ వారసుడిగా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన గంభీర్.. తొలి పర్యటనలోనే మిశ్రమ ఫలితాలను ఎదుర్కొన్నాడు. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ విజయాన్నందుకున్న గంభీర్.. వన్డే సిరీస్‌లో మాత్రం ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.
స్పిన్ వికెట్లపై భారత బ్యాటర్లు దారుణంగా విఫమవ్వడంతో మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత శ్రీలంక చేతిలో భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో టీ20, టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్ కావడం తొలిసారి. ఈ ఘోర పరాజయంతో హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు మొదలయ్యాయి.
ఆసీస్ గడ్డపై ఘోర పరాభావం..
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని విజయంతో ప్రారంభించిన భారత్.. ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైంది. మూడో టెస్ట్‌ను వర్షం సాయంతో గట్టెక్కినా చివరి రెండు టెస్ట్‌ల్లో గెలిచే అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే గంభీర్ కోచింగ్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆశించిన ఫలితాన్ని సాధించకుంటే మాత్రం గంభీర్‌తో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లపై కూడా వేటు పడనుంది. గతంలో బెంచ్ ఆటగాళ్ల సాయంతో టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్.. ఈ సారి కనీస పోటీ ఇవ్వలేకపోవడం గంభీర్ వైఫల్యాన్ని బయటపెడుతోంది.