
ముంబై: కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న దేశానికి అండగా నిలిచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరోసారి ముందుకొచ్చింది. తమ వంతు సాయంగా 10 లీటర్ల కెపాసిటీ కలిగిన 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేయనుంది. 'కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో మెడికల్ ఈక్విప్‌మేంట్, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్యను తగ్గించేందుకు బోర్డు తమ వంతుగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేయనుంది.'అని ఆ ప్రకటనలో తెలిపింది.
ఇక బోర్డు అందించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు బాధితులకు ఉపశమనం కలిగించడంతో పాటు వైరస్ నుంచి విముక్తిని చేసేందుకు సాయపడతాయని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. 'వైరస్‌పై జరుగుతున్న ఈ యుద్దంలో వైద్యులు, ఆరోగ్య సంరక్షకులు చేస్తున్న పోరాటాన్ని బీసీసీఐ గుర్తించింది. వారు నిజంగా ఫ్రంట్‌లైన్ యోధులు.
ప్రజలను రక్షించడానికి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. బీసీసీఐ ఎప్పుడూ ఆరోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు బాధితులుకు తక్షణ ఉపశమనం అందించడమే కాకుండా కోలుకోవడానికి సహాయపడతాయి.'అని దాదా పేర్కొన్నాడు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడిన మెడికల్ ఈక్విప్ మెంట్ కొరతను బీసీసీఐ గుర్తించిందని, అందుకే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించాలనుకుంటుందని బోర్డు సెక్రటరీ జైషా తెలిపాడు. 'వైరస్ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సాముహిక పోరాటంలో మనమంతా ఒకరికి ఒకరం అండగా నిలవాలి. ఈ సెకండ్ వేవ్ సంక్షోభంతో దేశంలో నెలకొన్న మెడికల్ ఈక్విప్‌మెంట్ కొరతను బీసీసీఐ గుర్తించింది. దాంతోనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేయాలని భావించింది.
దాంతో ఆక్సిజన్ కొరతను కొంతవరకు తగ్గించడానికి ఈ ప్రయత్నం సాయపడుతుందని భావిస్తున్నాం. అతి త్వరలోనే ఈ వైరస్ గండం నుంచి మనమంతా బయటపడుతాం. ప్రస్తుతం టీకా డ్రైవ్ జరుగుతుంది. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు వేయించుకోండి'అని జైషా తెలిపాడు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో బీసీసీఐ రూ. 51 కోట్ల విరాళాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేసింది.