బ్రిస్బేన్ టెస్టులో ఆడతాం.. కానీ మొదటి ఫ్లయిట్‌లోనే పంపాలి: బీసీసీఐ

సిడ్నీ: బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. క్వీన్స్‌ల్యాండ్ ఆరోగ్య మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆటగాళ్లు హోటల్లో గదిలోనే ఉండాలనే కఠిన నిబంధనలు, బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్ విధించడం వంటి కారణాలతో చివరి టెస్టు జరుగుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే నాలుగో టెస్టు వేదిక విషయంలో సందిగ్ధత వీడింది. బ్రిస్బేన్‌లో మ్యాచ్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సమాచారం అందించింది.

బ్రిస్బేన్‌లో ఆడతాం
బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ ముగిశాక ఒక్క రోజు కూడా తాము అక్కడ ఉండబోమని, వెంటనే భారత్‌కు వెళ్లిపోయే ఏర్పాట్లు చేయాలని సీఏను బీసీసీఐ కోరింది. 'భారత జట్టు బ్రిస్బేన్‌లో టెస్టు ఆడుతుంది. చివరి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కు తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేయమని వారిని కోరాం. కుదిరితే అందుబాటులో ఉన్న మొదటి ఫ్లయిట్‌లోనే పంపిస్తే బాగుంటుంది. వీలుంటే మ్యాచ్ ముగిసిన రాత్రి కూడా అక్కడ ఆగకుండా బయల్దేరాలని భావిస్తున్నాం' అని బీసీసీఐ అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. మ్యాచ్ జరుగుతున్న రోజుల్లో హోటల్‌లో ఆటగాళ్లను స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించాలని కూడా కోరామని సదరు అధికారి చెప్పారు.

ప్రేక్షకులను అనుమతించం
మరోవైపు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌లో ప్రేక్షకులను అనుమతించడం లేదని బీసీసీఐ బోర్డు స్పష్టం చేసింది. కఠిన బయో బబుల్ వాతావరణంలో క్రికెటర్లు ఉండబోతున్నారని, ఇలాంటి స్థితిలో తాము రిస్క్ తీసుకోలేం కాబట్టి అభిమానులను ఒక్క మ్యాచ్‌కూ అనుమతించమని వెల్లడించింది. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు సంబందించిన షెడ్యూల్ అధికారికంగా ఇంకా వెలుబడలేదు. కానీ ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు పర్యటన కొనసాగే అవకాశం ఉంది. టెస్ట్, వన్డే, టీ20 మ్యాచులు ఇరు జట్లు ఆడనున్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ 2021 జరగనుందని సమాచారం.

రహానే సేనకు ఇబ్బందులు
కరోనా కొత్తరకం వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా యూకే నుంచి స్వదేశానికి వచ్చిన వారి విషయంలో కరోనా నెగెటివ్ అని తేలినా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అయితే ప్రస్తుతం భారత్ ఉన్న సిడ్నీలో స్ట్రైయిన్ కేసులు లేవు. కానీ నాలుగో టెస్టు జరగనున్న బ్రిస్బేన్‌లో ఇప్పటికే ఒక కేసు నమోదైంది. ఆఖరి టెస్టు ముగిసేలోపు అక్కడ కొత్త కరోనా కేసులు పెరిగినా.. ఆలోపు విదేశాల నుంచి వచ్చే వారిపై భారత్ ప్రభుత్వం కఠిన క్వారంటైన్ నిబంధనలు విధించినా రహానే సేనకు ఇబ్బందులు తప్పవు. దీంతో స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది.
ISL 2020 21: మెరిసిన స్టెయిన్‌మన్.. ఈస్ట్ బెంగాల్‌కు మరో విజయం!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications