
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. వెన్ను నొప్పితో ఆసియా కప్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఆస్ట్రేలియా వేదికగా జరిగే మెగా టోర్నీకి కూడా అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. 2019లో అయిన వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టిందని సమాచారం. దీంతో టీ20 వరల్డ్ కప్‌కు మరో రెండు నెలలే సమయం ఉండటంతో అటు బీసీసీఐ, ఇటు సెలెక్టర్లు ఆందోళనలో పడ్డారు.
'బుమ్రా గాయం తీవ్రంగా మారింది. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అత్యుత్తమ వైద్య సలహాలను తీసుకుంటున్నాడు. పాత గాయం మళ్లీ తిరగబెట్టడం సమస్యగా మారింది. మాకు రెండు నెలలే సమయం ఉండటంతో ఏటూ తేల్చుకోలేకపోతున్నాం. ప్రపంచ బెస్ట్ బౌలర్ కావడంతో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం'అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నాడు. మరోవైపు యంగ్ పేసర్ హర్షల్ పటేల్ కూడా పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దీని కారణంగా ఆసియాకప్‌కు దూరమయ్యాడు. తాను ఎప్పటిలోపు కోలుకుంటాడో క్లారిటీ లేదు. ఒకవేళ ఈ ఇద్దరూ దూరమైతే సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
అయితే పేస్, బౌన్సీ పిచ్‌లైన ఆస్ట్రేలియాలో బుమ్రా గైర్హాజరీ టీమిండియాకు నష్టం చేస్తోంది. ముఖ్యంగా కచ్చితమైన యార్కర్లు వేయడంలో బుమ్రా దిట్ట. టీ20 ఫార్మాట్‌లో యార్కర్లు వేయడం చాలా కీలకం. బుమ్రా స్థాయిలో యార్కర్లు వేయగల మరో బౌలర్ భారత జట్టులో లేడు. అర్షదీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నా.. అతను మెగా టోర్నీ ఒత్తిడి ఎలా జయిస్తాడనేది కీలకం కానుంది.