
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో గత రెండేళ్లుగా బయో బబుల్‌లో మ్యాచ్‌లు ఆడుతూ తీవ్ర చికాకు గురవుతున్న ఆటగాళ్లకు ఉపశమనం కలిగేలా ఆ నిర్ణయం ఉన్నట్లు సమాచారం.
సొంతగడ్డపై జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ను బయో బబుల్ లేకుండానే నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ బీసీసీఐ అధికారి ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి తెలిపాడు. 'పరిస్థితులన్నీ చక్కబడితే సౌతాఫ్రికాతో సిరీస్‌ను బయోబబుల్ లేకుండానే నిర్వహిస్తాం. కఠినమైన క్వారంటైన్ నిబంధనలను ఎత్తివేసే అవకాశం ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ దేశాల్లో బయోబబుల్ లేదు. అంతేకాకుండా సుదీర్ఘకాలం బయోబబుల్‌లో ఉండటం చాలా కష్టంతో కూడుకున్నది. ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొంతమంది ప్లేయర్లు స్వల్ప విరామం తీసుకుంటున్నప్పటికీ.. సిరీస్ తర్వాత సిరీస్ బయోబుబల్‌లో గడపటం ఇబ్బందే. ఐపీఎల్‌తో ఆటగాళ్లంతా రెండు నెలల పాటు కఠిన బయోబబుల్‌లోనే ఉండనున్నారు'అని సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చాడు.
సౌతాతో భారత్ జూన్ 9 నుంచి 19వ తేదీ వరకు ఐదు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. ఢిల్లీ, కటక్, వైజాగ్, రాజ్‌కోట్, బెంగళూరు వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌లకు టీమిండియా వెళ్లనుంది. అయితే చైనాలో కరోనా నాలుగో వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో బబుల్ లేకుండా మ్యాచ్‌లను నిర్వహించే సాహసం బీసీసీఐ చేయదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌లోనే కరోనా కేసులు వెలుగు చూశాయని, బబుల్ లేకుండా సిరీస్ నిర్వహించడం కష్టమని చెబుతున్నారు.