KS Bharat: తెలుగోడికి మళ్లీ అన్యాయమే.. అప్పుడు 3డీ.. ఇప్పుడు అటాకింగ్ అంటూ..!

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగే 'బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ'లోని తొలి రెండు టెస్టుల కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టులో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కూడా చోటు దక్కించుకున్నాడు. సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా జట్టుకు దూరమైనప్పటి నుంచి తెలుగు తేజం కేఎస్ భరత్ భారత టెస్ట్ టీమ్‌లో కొనసాగుతున్నాడు.
కానీ తుది జట్టులో అవకాశాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇన్నాళ్లు రిషభ్ పంత్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. ఇక రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై జట్టుకు దూరమవడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కేఎస్ భరత్ అరంగేట్రం చేయడం ఖాయమని అంతా భావించారు. కానీ ఇషాన్ కిషన్ రూపంలో మళ్లీ అతనికి పోటీ ఎదురవ్వనుంది.

అటాకింగ్ కోసం ఇషాన్..
రిషభ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినా... కేఎస్ భరత్‌కు బ్యాకప్‌గా ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ బీసీసీఐ వర్గాలు మాత్రం ఇషాన్ కిషన్‌నే ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపిక చేశామని, రిషభ్ పంత్‌లా అతను అటాకింగ్ గేమ్ ఆడగలడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారే టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. 'టాప్-6లో కేఎస్ భరత్ ఆడలేడు. భరత్‌ను ఆడిస్తే టీమ్ ఓ బౌలర్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇషాన్ కిషన్‌ను ఆడిస్తే టాప్-6లో ఎక్కడైనా బ్యాటింగ్‌కు పంపించవచ్చు. కానీ టెస్ట్ ఫార్మాట్‌లో ఇషాన్ కిషన్‌కు కీపింగ్ చేసిన అనుభవం లేదు. అదే సమస్యగా మారింది. రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఇషాన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కీపింగ్ చేయలేదు'అని సదరు అధికారి గుర్తు చేశాడు.

అవకాశం ఇవ్వకుండానే..
ఈ వ్యాఖ్యలతో కేఎస్ భరత్ అంతర్జాతీయ అరంగేట్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అటాకింగ్ పేరిట సుదీర్ఘ ఫార్మాట్‌లో ఏ మాత్రం అనుభవం లేని ఇషాన్ కిషన్‌ను కేఎస్ భరత్‌కు బదులు ఆడించడం ఏంటని తెలుగు అభిమానులు నిలదీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లంటేనే ఓ చిన్న చూపు ఉందని, అవకాశాలు ఇవ్వకుండా ఓ ఆటగాడి సామర్థ్యాన్ని ఎలా అంచనా వేస్తారని మండిపడుతున్నారు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా కేఎస్ భరత్‌కు మంచి అనుభవం ఉందని, భారత్ ఏ తరఫున అతను చాలా మ్యాచ్‌లు ఆడాడని గుర్తు చేస్తున్నారు. వృద్దిమాన్ సాహా స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా కీపింగ్ చేసిన భరత్ అదరగొట్టాడనే విషయాన్ని మరిచిపోవద్దంటున్నారు. ఆర్‌సీబీ తరఫున అతను సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడని, ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించాడని గుర్తు చేస్తున్నారు. ఇషాన్ కిషన్‌లా భరత్ కూడా దూకుడుగా ఆడగలడని చెప్తున్నారు.

వీవీఎస్ లక్ష్మణ్ నుంచి..
కేఎస్ భరత్ ఒక్కడే కాదు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజ్ ఇలాంటి వివక్షకు గురయ్యారు. 2003 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇలాంటి కారణాలతోనే వీవీఎస్ లక్ష్మణ్ స్థానంలో దినేష్ మోంగియాను జట్టులోకి తీసుకున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా త్రీడీ ఆటగాడని చెబుతూ అంబటి రాయుడికి బదులు విజయ్ శంకర్‌ను తీసుకున్నారు. 2022 టీ20 ప్రపంచకప్‌లో జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో సూపర్ ఫామ్‌లో ఉన్న మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకుండా అనుభవం పేరిట మహమ్మద్ షమీని తీసుకున్నారు. ఇప్పుడు అటాకింగ్ ఆప్షన్ పేరిట కేఎస్ భరత్‌ను పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications