టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భవితవ్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం(జనవరి 12) జరగబోయే బీసీసీఐ కార్యవర్గ ప్రత్యేక సమావేశంలో హిట్‌మ్యాన్ భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
ప్రస్తుతం రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ఈ సిరీస్‌ను టీమిండియా 1-3తో ఆసీస్‌కు కోల్పోయింది. పేలవ ఫామ్‌తో సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌కు రోహిత్ దూరంగా ఉన్నాడు. దాంతో అతను రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రచారాన్ని రోహిత్ ఖండించాడు. తాను రిటైర్ అవ్వలేదని, జట్టు ప్రయోజనాల కోసం తుది జట్టు నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం రిటైర్మెంట్‌పై ఆలోచన లేదన్నాడు. రోహిత్ క్లారిటీ ఇచ్చినా అతని భవితవ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న రోహిత్ శర్మ.. ఇంకెన్నాళ్లు క్రికెట్‌లో కొనసాగుతాడు? అనే ప్రశ్నగా మారింది.
ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 6.2 యావరేజ్‌తో 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు రోహిత్. ఆస్ట్రేలియాలో అత్యల్ప పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. అంతే కాకుండా సెప్టెంబరు 2024 నుంచి రోహిత్ ఆడిన.. చివరి ఎనిమిది టెస్టుల్లో కేవలం 164 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వాటిలో ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉంది.
బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ట్రెజరర్‌గా ప్రభ్‌తేజ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కొత్తగా ఈ ఇద్దరూ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆదివారం బీసీసీఐ కార్యవర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో టీమిండియా టెస్ట్ ప్రదర్శనపై సమీక్ష జరపనున్నారు. అలాగే రోహిత్ శర్మ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
జట్టు ఎంపిక విషయంలో కఠినంగా ఉండాలని, సీనియర్ల విషయంలో రెండో ఆలోచన చేయాల్సిన అవసరం లేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను ఆదేశించినట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమితో టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. అప్‌కమింగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 జూలైలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌తో ప్రారంభం కానుంది. అప్పటి వరకు కుర్రాళ్లను రెడీ చేయాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.