
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు భారత మహిళా క్రికెటర్లు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం పురుషల క్రికెటర్లతో కలిసి ముంబైలోని ఓ హోటల్‌లో బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో క్వారంటైన్ లో ఉన్నప్పటికీ తమ ఫిట్‌నెస్ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. బయోబబుల్లో ప్రత్యేక జాగ్రత్తలతో ఏర్పాటు చేసిన జిమ్‌లో క్రికెటర్లంతా చెమటోడ్చారు. తమ సమయాన్ని కొంచెం కూడా వృథా చేయడం లేదు. దేహధారుడ్యాన్ని పెంచుకుంటూ ఫిట్‌గా ఉండేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఆ వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో గురువారం షేర్ చేసింది. 'షట్ ది నాయిస్' అని క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.
ఈ వీడియోలో కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, జూలన్ గోస్వామి, ఎక్తా బిష్త్ తదితరులు వర్కౌట్స్ చేస్తూ చెమటోడ్చుతున్నారు. పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ.. బౌలింగ్ యాక్షన్ ప్రాక్టీస్ చేశారు. ఈ పర్యటనలో భారత మహిళలు ఇంగ్లండ్‌తో ఓ టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 16 నుంచి ప్రారంభంకానుంది. పురుష క్రికెటర్లతో కలిసి భారత మహిళలు జూన్ 2 ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. అక్కడ 10 రోజుల ఐసోలేషన్‌లో ఉండనున్నారు.