
హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 50 ఏళ్లుగా మనకు విజయం లేని మైదానం! పరిస్థితుల పరంగా ఇంగ్లండ్‌కు సూపర్ అడ్వాంటేజ్.. ఈ రెండింటికి తోడుగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హోమ్ టీమ్‌కు భారీ ఆధిక్యం. ఇలా మూడు ప్రతికూలతల మధ్య ఆట మొదలుపెట్టిన టీమిండియా.. నాలుగో టెస్ట్‌లో అద్భుతం చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ.. శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండ్ షోతో.. బలమైన ఇంగ్లండ్‌కు చెక్ పెట్టింది. భారీ టార్గెట్‌ను నిర్దేశించడంతో పాటు.. అద్భుత బౌలింగ్‌తో రూట్‌సేన వికెట్లను విరిచేసి గ్రాండ్ విక్టరీని కొట్టింది. దీంతో అచ్చిరాని మైదానంలోనే అసాధారణ విజయంతో సిరీస్‌లో 2-1తో లీడ్‌లో నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల యావత్ భారత్ పులికించిపోయింది.
ఆటగాళ్ల ఆనందానికైతే హద్దే లేకుండా పోయింది. విజయం సాధించిన వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లీ గెలుపు శంఖారావం చేయగా.. ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో సరదాగా గడిపారు. ఇంగ్లండ్ ఆఖరి వికెట్ పడగానే మైదానం హోరెత్తింది. భారత అభిమానులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. ఆటగాళ్లంతా హుషారుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి చేరుకున్నారు. మైదానం నుంచి వస్తున్న ఒక్కొక్కరిని.. సిబ్బంది, ఆటగాళ్లు ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
'డోంట్ మిస్! చారిత్రక విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో మీరు చూడని స్పందనలు, దృశ్యాలను మీ ముందుకు తెస్తున్నాం' అంటూ బీసీసీఐ ఆ వీడియోకు క్యాప్షన్‌గా పేర్కొంది. సెంచరీ వీరుడు రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, పేసర్ ఉమేశ్ యాదవ్ ఆ వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడారు. 'వికెట్ మందకొడిగా ఉందని తెలుసు. అందుకే ఐదో రోజు మేం మరింత కష్టపడ్డాం. మంచి లెంగ్తుల్లో బంతులు వేశాం. పరుగులు నియంత్రించేందుకు ప్రయత్నించాం.
అప్పుడు వికెట్లు పడతాయని తెలుసు' అని ఉమేశ్ యాదవ్ అన్నాడు. ఆటపై తన ప్రభావం చూపించాలని అనుకున్నానని శార్దూల్ ఠాకూర్ చెప్పాడు. 'గొప్పగా అనిపిస్తోంది. నేను ఆడతానని తెలిసిన రోజు నుంచి ఆటపై ప్రభావం చూపించాలని భావించాను. జట్టు గెలిచేందుకు అవసరమైన ప్రతిదీ చేయాలని అనుకున్నాను' అని ఠాకూర్ చెప్పుకొచ్చాడు.
యా భై ఏళ్ల తర్వాత ఓవల్‌లో భారత్‌కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమ్ ఇండియా నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఆతిథ్యఇంగ్లండ్ను ఓడించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో అయిదో రోజు, సోమవారం బరిలోకి దిగినఇంగ్లండ్.. 210 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఆ జట్టు పతనాన్ని శాసించారు. ఓపెనర్లు హమీద్ (63), బర్న్స్ (50) తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించినా.. ఆ తర్వాత వచ్చినఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చివరి టెస్టు శుక్రవారం ఆరంభమవుతుంది.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 191 ఆలౌట్ (శార్దూల్ ఠాకూర్ 57, కోహ్లీ 50)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్ (ఓలీ పోప్ 81, క్రిస్ వోక్స్ 50
భారత్ రెండో ఇన్నింగ్స్: 466 (రోహిత్ 127, పుజారా 61, శార్దూల్ 60, పంత్ 50)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 210 ఆలౌట్