ఇషాన్.. డబుల్ సెంచరీ తర్వాత 3 మ్యాచ్‌లు ఆడలేదు కదా? నవ్వులు పూయించిన రోహిత్! (వీడియో)

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే విజయానంతరం యువ క్రికెటర్లు, డబుల్ సెంచరీ హీరోలు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లతో సరదాగా మాట్లాడాడు. ఈ ఇద్దరిపై ప్రశంసల జల్లు కురిపించిన రోహిత్.. శుభ్‌మన్ గిల్‌ను 200 క్లబ్‌లోకి ఆహ్వానించాడు. ఉప్పల్ మైదానం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో గట్టెక్కిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208) డబుల్ సెంచరీతో చెలరేగాడు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ శుభ్‌మన్ ఒక్కడే అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
శుభ్‌మన్ బెస్ట్ ఇన్నింగ్స్..
ఈ విజయానంతరం యంగ్ డబుల్ సెంచరీ హీరోలు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లను మూడు ద్విశతకాలు ఉన్న రోహిత్ బీసీసీఐ టీవీలో ఇంటర్వ్యూ చేశాడు. తనదైన వ్యాఖ్యలతో ఇంటర్వ్యూ ఆసాంతం నవ్వించాడు. ముందుగా శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రశంసించిన రోహిత్.. ఇది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాడు. శుభ్‌మన్ తర్వాత జట్టులో హయ్యెస్ట్ స్కోర్ 34 పరుగులేనని, దీన్ని బట్టి ఇది ఎంత గొప్ప ఇన్నింగ్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నాడు. ఇక శుభ్‌మన్ గిల్ క్రీజులో తన మైండ్ సెట్‌ను వెల్లడించాడు. న్యూజిలాండ్ సెట్ అవ్వకుండా ఎలా అటాకింగ్ చేశాననే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

రూమ్ షేర్ చేసుకొని డబుల్ కొట్టేసావ్..
అదే సమయంలో ఇషాన్ కిషన్ జోక్యం చేసుకొని ప్రీ మ్యాచ్ రోటిన్ చెప్పమని శుభ్‌మన్‌ను అడిగాడు. వెంటనే రోహిత్.. ఇద్దరిది ఒకే రూమ్ కదా.. ఇషాన్ కిషన్‌కు తెలిసి ఉంటది కదా..?అని పేర్కొన్నాడు. శుభ్‌మన్ గిల్ మాత్రం.. తన ప్రీ మ్యాచ్ రొటీన్‌ను నాశనం చేశాడని చెప్పాడు. కిషన్ సినిమాలు చూస్తాడని, తనను సరిగ్గా నిద్రపోనివ్వడని పేర్కొన్నాడు. ఇంతలోనే ఇషాన్ కలగజేసుకొని తనతో రూమ్ షేర్ చేసుకున్నందుకు తొలి వన్డేలో తన పరుగులను కూడా తీసుకొని డబుల్ సెంచరీ కూడా సాధించావని చమత్కరించాడు.

మూడు మ్యాచ్‌లు ఆడలేదు కదా..?
ఆ తర్వాత రోహిత్ శర్మ అధికారికంగా శుభ్‌మన్ గిల్‌ను 200 క్లబ్‌లోకి ఆహ్వానించాడు. దీనికి శుభ్‌మన్ గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్‌ను ఉద్దేశించి రోహిత్ జోకులు పేల్చాడు. 'ఇషాన్.. డబుల్ సెంచరీ తర్వాత నీవు మూడు మ్యాచ్‌లు ఆడలేదు కదా?'అని ప్రశ్నించాడు. దీనికి ఇషాన్ కిషన్ 'బ్రదర్.. నువ్వే కెప్టెన్ కదా?'అంటూ అడిగాడు. దాంతో ముగ్గురు విరగబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

భయపెట్టిన బ్రేస్‌వెల్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208) ఒక్కడే డబుల్ సెంచరీ బాదగా.. రోహిత్ శర్మ(34), సూర్యకుమార్ యాదవ్(31) రాణించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 337 పరుగులకు కుప్పకూలింది. మైకేల్ బ్రేస్‌వెల్(78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140) విధ్వంసకర సెంచరీతో ఓడించినంత పనిచేశాడు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షమీ, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications