టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడే విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది. జస్‌ప్రీత్ బుమ్రా గాయానికి సంబంధించిన స్కాన్ ఫలితాలను వైద్యులు పరిశీలించి రేపే(మంగళవారం) బీసీసీఐకి నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లకు దూరమవుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించిన జట్టులో మార్పులు చేర్పులకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే బుమ్రా విషయమై ఆచితూచి వ్యవహారించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతని విషయంలో తొందరపడకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. వైద్యులు అందించే నివేదికలో బుమ్రా ఆడలేడని పేర్కొంటేనే అతన్ని జట్టు నుంచి తొలగించాలని, లేదంటే జట్టులో కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జట్టులో మార్పులు, చేర్పులకు విధించిన గడువు ముగిసిన తర్వాత మార్పులు చేయాలంటే ఐసీసీ టెక్నికల్ టీమ్ అనుమతి తీసుకోవాలి. అయితే బుమ్రాను నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. బుమ్రాకు బ్యాకప్‌గానే హర్షిత్ రాణాను సిద్దం చేస్తున్నారని, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడిస్తున్నారని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ ప్రధాన పేసర్లుగా ఎంపికవ్వగా.. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. లీగ్ దశ మ్యాచ్‌ల్లో బుమ్రా లేకపోయినా ఈ ముగ్గురితో టీమిండియా రాణించగలదనే అభిప్రాయంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. బుమ్రా నాకౌట్ మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చినా టీమిండియా బలం రెట్టింపు అవుతుందనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం బుమ్రా ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే జిమ్ చేయడం ప్రారంభించిన అతను ఫిజియోల సమక్షంలో అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తున్నాడు.