
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మధ్య ఎలాంటి గొడవల్లేవని బీసీసీఐ సెలెక్టర్ ఒకరు స్పష్టం చేశారు. వారి మధ్య కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. సుదీర్ఘ కాలం తర్వాత ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేశాడు. అయితే ఈ ఇద్దరి మధ్య సమన్వయం కొరవడినట్లు అనిపించింది. ముఖ్యంగా ధావన్ ఎడమోహం పెడమోహంగా కనిపించాడు. అతని శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. దాంతో రోహిత్‌తో అతనికి గొడవలున్నాయనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా ఈ పుకార్లపై స్పందించిన బీసీసీఐ సెలెక్టర్ ఒకరు వాటిని కొట్టిపారేసాడు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి విభేధాల్లేవని, అయితే ధావన్ స్ట్రైక్ రేట్‌ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. జింబాబ్వే టూర్ అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఈ విషయంపై అతనితో మాట్లాడుతారని చెప్పాడు.
'శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. ఇదేం తప్పు కాదు. జింబాబ్వే పర్యటన అనంతరం శిఖర్‌తో కలిసి అతని భవిష్యత్తు ప్రణాళికపై చర్చిస్తాం. అతను బ్యాటింగ్ అప్రోచ్ ఏమైనా మార్చాల్సి ఉందా? అనే విషయంపై విక్రమ్ రాథోడ్, రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతారు. మేం ఈ విషయంలో జోక్యం చేసుకోం'అంటూ సదరు సెలెక్షన్ కమిటీ మెంబర్ ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌తో అన్నాడు.
టీ20, టెస్ట్ టీమ్‌కు దూరమైన శిఖర్ ధావన్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని చెప్పిన ధావన్ అందుకోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టును నడిపిస్తున్నాడు. అయితే ఓపెనర్‌గా అతని స్థానం సుస్థిరం చేసుకోవాలంటే అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే అతనికి కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్‌ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. రాహుల్ గాయపడటంతోనే జట్టులోకి వచ్చిన ధావన్.. ఈ అవకాశాన్ని సద్వినయోగం చేసుకున్నాడు.