అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ పదవి రేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షా ఉన్నట్లు తెలుస్తోంది. పేరుకు బీసీసీఐ కార్యదర్శి అయినా.. భారత క్రికెట్‌ను అంతా తానై నడిపిస్తున్నారు. బీసీసీఐ షాడో ప్రెసిడెంట్‌గా.. బాస్‌గా చలామణి అవుతున్నారు. అలాంటి జైషా ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్ పదవిపై కన్నేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగుస్తుంది. మరోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని అతను నిర్ణయించుకోవడంతో జై షా పోటీ పడుతారనే చర్చ జోరుగా సాగుతుంది. అయితే ఈ వ్యవహారంపై ఆగస్ట్ 27న స్పష్టత రానుంది. ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు అది ఆఖరి రోజు.

రూల్స్ ప్రకారం పర్యాయానికి రెండేళ్ల చొప్పున ఎవరైనా ఐసీసీ ఛైర్మన్‌గా మూడు పర్యాయాలు ఉండొచ్చు. న్యూజిలాండ్‌కు చెందిన బార్‌క్లే ఇప్పటికే నాలుగేళ్లు పూర్తి చేశాడు. మూడో సారి ఛైర్మన్ పదవికి పోటీ చేయనని బార్‌క్లే చెప్పాడని ఐసీసీ ప్రకటించింది. నవంబరులో తన పదవీకాలం ముగిసిన తర్వాత తప్పుకుంటాడని పేర్కొంది.
బార్‌క్లే 2020 నవంబర్‌లో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా.. 2022లో తిరిగి ఎన్నికయ్యాడు. ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 ఓట్లు ఉండగా.. 9 ఓట్లు లభించిన వ్యక్తి గెలుస్తాడు. జై షా ప్రస్తుతం ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉప సంఘం అధిపతిగా ఉన్నారు. ఓటు హక్కు ఉన్న చాలా దేశాలు జై షా పట్ల సానుకూలతతో ఉన్నాయి.
బీసీసీఐ కార్యదర్శిగా జై షాకు మరో ఏడాది పదవీ కాలం ఉంది. ఆ తర్వాత అతను రూల్స్ ప్రకారం మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలి. బీసీసీఐలో ఎలాంటి పదవుల్లో కొనసాగకూడదు. ఈ క్రమంలోనే ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టాలని జైషా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎన్నికైతే.. ఈ పదవి చేపట్టిన అతి పిన్నవయస్కుడిగా ఆయన రికార్డుకెక్కనున్నారు.
అంతేకాకుండా ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికైన ఐదో భారతీయుడిగా నిలవనున్నారు. జగన్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్‌లు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.