క్రికెట్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చరిత్ర సృష్టించింది. సంపదను సృష్టించడంలో మరోసారి రారాజుగా నిలిచింది. క్రికెట్ పెద్దన్నగా ప్రపంచాన్ని శాసిస్తున్న బీసీసీఐ.. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 9,741.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో సగం కంటే ఎక్కువ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారానే రావడం గమనార్హం. ప్రస్తుతం బీసీసీఐ వద్ద సుమారు రూ. 30 వేల కోట్లు సేవింగ్స్‌గా ఉండగా.. వీటి మిత్తి(వడ్డీ) ద్వారానే ఏడాదికి బోర్డు ఖాతాలో రూ. 1000 కోట్లు జమవుతున్నాయి. ప్రస్తుతం ఈ లెక్కలు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతుగా మారింది. బోర్డు ఆర్జించిన వార్షిక ఆదాయంలో ఐపీఎల్ వాటా 59 శాతంగా ఉంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే రూ. 5,761 కోట్లు బోర్డు ఖాతాలో చేరాయి. 2007లో ప్రారంభమైన ఐపీఎల్..బీసీసీఐ తలరాతను పూర్తిగా మార్చేసింది. కేవలం వ్యూయర్ షిప్, ప్రతిభ కలిగిన ఆటగాళ్లను వెలికి తీయడమే కాకుండా ఆర్థికంగా బోర్డుకు కీలకంగా మారింది. ఈ టోర్నీ మీడియా హక్కుల ద్వారానే బీసీసీఐ కోట్ల రూపాయాలను ఆర్జిస్తోంది. ప్రతిభ కలిగిన దేశవాళీ ఆటగాళ్లకు కూడా ఐపీఎల్ ఓ వేదికగా మారింది. సీజన్ సీజన్‌కు మరింత అభివృద్ది చెందుతూ బ్రాడ్‌కాస్టర్స్, స్పాన్సర్స్ నుంచి డిమాండ్‌ను సొంతం చేసుకుంటుంది.
ఐపీఎల్ కానీ మీడియా హక్కుల ద్వారా బోర్డు అదనంగా రూ. 361 కోట్లను ఆర్జించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా బోర్డుకు రూ. 378 కోట్లు వచ్చాయి. రూ. 30వేల కోట్ల సేవింగ్స్ నుంచి దాదాపు రూ. 1000 కోట్ల వడ్డీ వచ్చింది.

ఐపీఎల్: రూ. 5, 761 కోట్లు(59.1 శాతం)
ఐసీసీ షేర్: రూ.1042 కోట్లు(10.7 శాతం)
సేవింగ్స్ వడ్డీ: రూ. 987 కోట్లు(10.1 శాతం)
ఐపీఎల్ మినహా మీడియా రైట్స్: రూ. 361 కోట్లు (అంతర్జాతీయ మ్యాచ్‌లు) (3.9 శాతం)
డబ్ల్యూపీఎల్: రూ. 378 కోట్లు (3.9 శాతం)
టికెట్లు, కమర్షియల్ రైట్స్(హోమ్ మ్యాచ్‌లు): రూ. 361 కోట్లు(3.7 శాతం)
ఏడాది ఏడాదికి బీసీసీఐ ఆదాయం పెరుగుతుందే తప్పా తగ్గడం లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,360 కోట్లు ఆర్జించిన బీసీసీఐ.. 2022-23లో రూ. 6820 కోట్లను రాబట్టింది. ఇప్పుడు ఏకంగా రూ.9,741.7 కోట్లను ఆర్జించింది. గత రెండేళ్లలో బీసీసీఐ ఆదాయం రూ.5 వేల కోట్లు పెరిగింది. ఐపీఎల్ మీడియా రైట్స్, కమర్షియల్ ఒప్పందాలతోనే ఈ పురోగతి సాధ్యమైంది.