
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కరోనా వదలడం లేదు. ఇటీవలే నెగటీవ్ రావడంతో డిశ్చార్జ్ అయిన గంగూలీకి తాజా పరీక్షల్లో పాజిటీవ్ అని తెలియింది. అయితే దాదాకు సోకింది ఒమిక్రాన్ కాదని అతనికి చికిత్స అందిస్తున్న వుడ్ లాండ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లుగా గుర్తించామని పేర్కొన్నాయి.
గత వారం కరోనా వైరస్ బారిన పడిన గంగూలీ కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగెటివ్ రావడంతో డిశ్ఛార్జి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు డెల్టా ప్లస్ పాజిటివ్‌గా గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించామన్నారు.
ఇన్ఫెక్షన్ తీవ్రత ఆందోళన చెందే స్థాయిలో లేకపోవడంతో ఇంటి వద్దే ఆయనకు చికిత్స అందిస్తున్నామని, మరో 15 రోజులపాటు గంగూలీ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లో ఉంటారని వుడ్ ల్యాండ్ ఆస్పత్రి ప్రతినిధులు తెలిపారు. గంగూలీకి ఒమిక్రాన్ పాజిటివ్ లేకపోవడం ఊరట కలిగించినప్పటికీ, ఇలా గంటల వ్యవధిలోనే నెగటివ్, పాజిటివ్ రావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గంగూలీ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ బారిన పడటం ఆందోళన రేకెత్తిస్తోంది.
కాగా ఈ ఏడాది ఇప్పటికే గంగూలీ రెండుసార్లు అనారోగ్యం బారిన పడిన విషయం విదితమే. ఆంజియోప్లాస్టి నిర్వహించిన తర్వాత అనారోగ్య కారణాల రీత్యా కొన్నిరోజుల పాటు ఆయన ఆస్పత్రిలో ఉన్నారు.