ఆ సన్‌రైజర్స్ బౌలర్లకు టీమిండియాలో చోటు ఖాయం.. హింట్ ఇచ్చిన బీసీసీఐ బాస్!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న యువ పేసర్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సీజన్ ద్వారా ఎంతో ప్రతిభావంతులైన పేసర్లు వెలుగులోకి వచ్చారని తెలిపాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. అతి త్వరలోనే అతను టీమిండియాలోకి వస్తాడని ఆకాంక్షించాడు. ఈ రోజుల్లో 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు ఎంతమందని, అతని జాగ్రత్తగా వాడుకుంటామని తెలిపాడు. ఉమ్రాన్ మాలిక్‌తో పాటు నటరాజన్, కుల్దీప్ సేన్ సైతం ఆకట్టుకున్నారని కొనియాడాడు.

బౌలర్ల ఆధిపత్యం చూస్తుంటే...
మిడ్ డే చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లీగ్ గురించి మాట్లాడిన దాదా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వైఫల్యంపై పెద్దగా దిగులు చెందడం లేదని చెప్పాడు. 'ఈ సీజన్‌లో బౌలర్లు ఆధిపత్యం చలాయించడం చూసి సంతోషపడ్డా. పుణే, ముంబై పిచ్‌లు చాలా బాగున్నాయి. ఈ వికెట్స్‌పై అనూహ్య బౌన్స్ కూడా ఉంది. పేసర్లతో పాటు స్పిన్నర్లు రాణిస్తున్నారు. ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నారు? వేల మీద లెక్కపెట్టవచ్చు.

ఉమ్రాన్ టీమిండియాకు ఆడటం..
ఉమ్రాన్ టీమిండియాకు ఎంపికైనా నేను ఆశ్చర్యపోను. మేం అతన్ని జాగ్రత్తగా వాడుకుంటాం. కుల్దీప్ సేన్ బౌలింగ్ సైతం నన్ను ఆకట్టుకుంది. నటరాజన్ సైతం అదరగొట్టాడు. అతను భారత జట్టులోకి రావడం ఖాయం. ఇక జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు కూడా అందుబాటులో ఉన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం సెలెక్టర్లదే'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

ఎలాంటి దిగులు లేదు..
ఐపీఎల్ 2022 సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ, ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. వారి పేలవ ఫామ్‌ను చూసి ఏ మాత్రం దిగులు చెందడంలేదని చెప్పాడు. 'రోహిత్, కోహ్లీ ఫామ్‌ను చూసి దిగులు చెందడం లేదు. ఈ ఇద్దరు బిగ్ ప్లేయర్స్. టీ20 ప్రపంచకప్‌కు చాలా సమయం ఉంది. ఆ టోర్నీ సమయానికి ఈ ఇద్దరూ లయ అందుకుంటారనే నమ్మకం నాకుంది.'అని దాదా చెప్పుకొచ్చాడు.

రోహిత్, విరాట్ విఫలం..
విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడి 19.66 సగటుతో కేవలం 236 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. మూడు మ్యాచ్‌ల్లో అతను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మరోవైపు రోహిత్ శర్మ 12 మ్యాచ్‌ల్లో 18.16 సగటుతో 218 రన్స్ చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. వీరి దారుణ వైఫల్యం నేపథ్యంలోనే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications