
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు. అతని సోదరుడు స్నేహాశీష్ గంగూలీకి తాజాగా కరోనా సోకడంతో దాదాతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. తనదైన సారథ్యంతో భారత క్రికెట్‌లో విప్లవాన్ని తీసుకొచ్చిన సౌరవ్.. ఈ నెల 8న 48వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన బర్త్‌డే వేడుకలకు అతని సోదరుడుస్నేహాశీష్ కూడా హాజరు కావడంతో ముందు జాగ్రత్తగా గంగూలీతో పాటు అతని కుటుంబ సభ్యులు హోమ్ క్వారంటైన్ పాటిస్తున్నారు.
ఇక గత కొద్దిరోజులుగా స్నేహాశీష్ జ్వరంతో బాధపడుతుండటంతో కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) బుధవారం ప్రకటించింది. అతన్ని బెల్లెవి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇక సోదరుడికి కరోనా రావడంతో హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం తాను హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నట్లు దాదా.. బీసీసీఐకి సమాచారం ఇచ్చారని అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. గంగూలీతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కనీసం 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండనున్నారని తెలిపాయి.
వాస్తవానికి గత నెల 20న స్నేహాశీష్ భార్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అతనికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. కానీ క్యాబ్ సెక్రటరీగా పనిచేస్తున్న స్నేహాశీష్ ఆ వార్తల్ని ఖండించాడు. క్యాబ్ కూడా తమ సెక్రటరీ ఆరోగ్యంగా ఉన్నాడని.. అతను రోజూ ఆఫీస్‌కి వస్తున్నట్లు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక పశ్చిమ బెంగాల్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 32,838కి చేరగా.. 11,927 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. ఇక రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఈడెన్ క్రికెట్ మైదానాన్ని క్వారంటైన్ సెంటర్‌గా ఉపయోగించుకుంటామని కోల్‌కతా పోలీస్ క్యాబ్‌ను కోరింది.