Sourav Ganguly: కలిసి ఆడలేదు కానీ.. కోహ్లీ ఆటంటే చాలా ఇష్టం!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఆడకపోయినా అతని ఆట అంటే తనకు చాలా ఇష్టమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. శ్రీలంకతో శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్ట్.. విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ మ్యాచ్. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీపై గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని దిగ్గజ ఆటగాడి స్థాయికి ఎదిగాడని కొనియాడాడు. త్వరలోనే మునపటి ఫామ్‌ను అందుకుని శతకాలు నమోదు చేస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
'భారత క్రికెటర్లలో చాలా కొద్ది మంది మాత్రమే 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇదొక మైలురాయి. నేను అతనితో కలిసి ఆడలేదు. కానీ, ఎప్పుడూ అతని ఆటను ఫాలో అవుతుంటాను. అతని టెస్ట్ కెరీర్ ఆరంభం నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని దిగ్గజ ఆటగాడి స్థాయికి ఎదిగాడు. కోహ్లీ టెక్నిక్, ఆట పట్ల పాజిటీవ్ థింకింగ్, ఫుట్ వర్క్..ఇలా చాలా విషయాలు నాకు బాగా నచ్చుతాయి.
అన్నింటికి మించి 2014 ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన తర్వాత.. తన ఆటను మార్చుకుని పునరాగమనం చేసిన తీరు అద్భుతం. ఆ సిరీస్‌కు నేను కామెంటేటర్‌గా పని చేశాను. కాబట్టి అతని ఆటను దగ్గరి నుంచి గమనించాను. ఆ తర్వాత ఐదేళ్ల వరకు అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ ఆటగాళ్లందరూ ఇలాంటి దశను అధిగమించి గొప్పగా రాణించిన వారే. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోహ్లీ ఆటలో కొన్ని చిన్న చిన్న మార్పులు అవసరం. అది పెద్ద కష్టమేం కాదు.
అతను త్వరలోనే ఈ క్లిష్ట దశను అధిగమిస్తాడు. మునపటి ఫామ్‌ను అందుకుని.. మళ్లీ శతకాలు బాదుతాడు. గత రెండేళ్లుగా సెంచరీలు నమోదు చేయకున్నా.. కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. సెంచరీలు చేయడమెలాగో అతనికి తెలుసు కాబట్టే ఇప్పటి వరకు 70 శతకాలు బాదాడు. లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. అతనిలో గొప్ప శక్తి సామర్థ్యాలున్నాయి. తగిన సమయం కోసం వేచి చూస్తున్నాడంతే'అని గంగూలీ చెప్పుకొచ్చాడు. సచిన్‌తో కోహ్లీని పోల్చడం సరికాదని దాదా అభిప్రాయపడ్డాడు. కోహ్లీలాంటి ఆటగాడిపై భారీ అంచనాలు ఉండటం సహజమేనని, అయితే వేర్వేరు జనరేషన్లు ఆటగాళ్లను పోల్చడం సరికాదన్నాడు. టెస్ట్‌ల్లో సచిన్ స్థానంలో బ్యాటింగ్ చేసినంత మాత్రానా సచిన్‌కు వారుసుడని చెప్పలేమన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications