ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూకుడే ఆ జట్టు పరాజయాలకు కారణమైందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తెలిపారు. మరోవైపు రోహిత్ శర్మ ఓపిక వల్లనే ఈ సిరీస్‌ను భారత్ సొంతం చేసుకోగలిగిందని అభిప్రాయపడ్డారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ చివరి మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ధర్మశాల వేదికగా గురువారం ప్రారంభమైన ఆఖరి మ్యాచ్‌కు హాజరైన రోజర్ బిన్నీ.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఈ సిరీస్‌లో బెన్ స్టోక్స్ చాలా దూకుడుగా వ్యవహరించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఈ జట్టు పరాజయానికి అతని దూకుడే ప్రధాన కారణం. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయకుండా భారత స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగడం ఆ జట్టు ఓటమిని శాసించింది.

మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వ్యూహాత్మక వ్యవహరించాడు. అతను కోరుకున్నది బౌలర్ల నుంచి రాబట్టగలిగాడు. ఇంగ్లండ్ తమ వ్యూహాన్ని మార్చుకుందని నేను భావించడం లేదు. తొలి టెస్టు మ్యాచ్‌లో ఎలా దూకుడుగా ఆడారో.. అదే అప్రోచ్‌ను కొనసాగించారు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఓపికగా ఉన్నాడు.
ఎందుకంటే సునాయసంగా గెలవాల్సిన తొలి టెస్ట్‌ను ఓడిపోవడంతో.. తర్వాతి రెండు టెస్ట్‌ల్లో ఓపికగా ఉండి విజయం సాధించాడు. ఇరు జట్ల కెప్టెన్ల మధ్య ఉన్న తేడా ఇదే.'అని రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డారు.
చివరి టెస్ట్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకు కుప్పకూలింది. జాక్ క్రాలీ(108 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 79)ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(5/72), రవిచంద్రన్ అశ్విన్(4/51) ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. జడేజాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), రోహిత్ శర్మ(83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు. శుభ్‌మన్ గిల్(26 బ్యాటింగ్)తో పాటు రోహిత్ శర్మతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్‌కు ఓ వికెట్ దక్కింది.