
ముంబై: కరోనా కారణంగా వాయిదా పడ్డా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్.. కరోనా వైరస్ కారణంగా వాయిదాపడే అవకాశం ఉండటంతో.. ఆ విండోలో ఐపీఎల్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ప్రాథమికంగా ఓ షెడ్యూల్‌ని రూపొందించిన బీసీసీఐ.. ఆతిథ్య వేదికలపై కసరత్తులు చేస్తున్నట్లు ముంబై మిర్రర్ పేర్కొంది.
ఆ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేసిన బీసీసీఐ.. వేదికలపై మాత్రం కసరత్తు చేస్తోందని తెలిపింది. ముఖ్యంగా హోటల్స్ దగ్గరగా ఉన్న స్టేడియాల జాబితాని పరిశీలిస్తోందని రాసుకొచ్చింది.
టోర్నీలో ఇప్పటి వరకూ ప్రతి జట్టూ సొంతగడ్డపై ఏడు లీగ్ మ్యాచ్‌లు.. ప్రత్యర్థి టీమ్ సొంతగడ్డపై ఏడు మ్యాచ్‌లు ఆడుతూ వస్తోంది. కానీ.. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సంప్రదాయం మారనుంది. కేవలం రెండు వేదికల్లోనే టోర్నీ మొత్తం నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. అలానే సెప్టెంబరులో ఉత్తరాదిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున దక్షిణ రాష్ట్రాల్లో అనువైన వేదికల్ని కూడా బీసీసీఐ పరిశీలిస్తోంది.
బెంగళూరు, చెన్నై వేదికగా నిర్వహించాలని, ముంబై కూడా హోటల్స్ దగ్గరగా ఉంటాయనుకుంటుంది. కానీ కరోనా ప్రభావం మహారాష్ట్ర.. తమిళనాడులో ఎక్కువగా ఉండటం బోర్డు పెద్దలకు తలనొప్పిగా మారింది. ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఛార్టర్ ప్లైట్స్‌ని ఏర్పాటు చేయడం, ముందుగానే హోటల్స్ బుక్ చేయడంపై కూడా బీసీసీఐ దృష్టిసారించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. తొలుత ఏప్రిల్ 15కు ఆ తర్వాత నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.