వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీతో టీమిండియా హెడ్ కోచ్‌గా తన పదవి కాలం పూర్తి చేసుకున్న రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతని కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. కానీ హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్ సుముఖంగా లేడని ప్రచారం జరుగుతోంది.
దాంతో టీ20 ప్రపంచకప్ వరకు అయినా హెడ్ కోచ్‌గా కొనసాగాలని ద్రవిడ్‌ను రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్‌లోనే టీ20 ప్రపంచకప్ జరగనుండటంతో.. ద్రవిడ్ అయితేనే టీమ్‌కు మేలు జరుగుతుందని బీసీసీఐ భావిస్తోంది. ద్రవిడ్‌ను కొనసాగించాలనే బీసీసీఐ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఆమోదం తెలిపినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే సౌతాఫ్రికా పర్యటనకు రాహుల్ ద్రవిడ్‌నే పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుండగా.. టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్‌లు ఆడనుంది. బీసీసీఐ ప్రతిపాదనకు రాహుల్ ద్రవిడ్ అంగీకరిస్తే.. ప్రపంచకప్ వరకు ఉన్న అతని సహాక సిబ్బంది కూడా కొనసాగే అవకాశం ఉంది.
బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు కాంట్రాక్ట్ పొడిగింపు లభించనుంది. 'రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ కొనసాగింపుపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సౌతాఫ్రికాతో సిరీస్ చాలా కీలకం. ఈ పర్యటనలోని టీ20 సిరీస్‌కు ద్రవిడ్ వెళ్లకపోతే.. వన్డే సిరీస్ సమయానికి కల్లా జట్టుతో కలవచ్చు.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
వీవీఎస్ లక్ష్మణ్ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బిజీగా ఉండటంతో అతనికి టీమిండియా హెడ్ కోచ్‌గా అదనపు బాధ్యతలు ఇవ్వలేమని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. పైగా అండర్ 19 ప్రపంచకప్‌కు అతను కుర్రాళ్లను సిద్దం చేయాల్సి ఉందని గుర్తు చేశాయి.
టీమిండియా టీ20 ఫార్మాట్ కోచింగ్ బాధ్యతలను ఆశిష్ నెహ్రాకు అప్పగించాలని బీసీసీఐ భావించిందని, కానీ ఈ పదవిని తీసుకునేందుకు అతను నిరాకరించాడని ప్రచారం జరగుతోంది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా టైటిల్ అందించడంతో పాటు రన్నరప్‌గా నిలబెట్టడంతో అతనికి ఈ బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ భావించిందంట. కానీ అతను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై బీసీసీఐ గానీ, ఆశీష్ నెహ్రా గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు.