టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో జట్టులో సమూల మార్పులు చేసేందుకు బీసీసీఐ శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్ల క్రమశిక్షణరాహిత్యంపై హెడ్ కోచ్ గంభీర్ సీరియస్‌గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కఠిన ఆంక్షలు అమలు చేయాలని గంభీర్ బోర్డుకు సూచించినట్లు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 1-3 తేడాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన విషయం తెలిసిందే.
కఠిన ఆంక్షలు..
ఈ పేలవ ప్రదర్శనపై ఇటీవలే బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు రోహిత్ శర్మ ఈ సమావేశానికి హాజరై ఓటమి గల కారణాలను వివరించారు. అయితే ఈ సందర్భంగా జట్టులో కఠిన నిబంధనలు అమలు చేయాలని గంభీర్.. బీసీసీఐకి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్ల కుటుంబ సభ్యుల విషయంలో ఆంక్షలు విధించాలని, వారితో గడిపే సమయానికి తగ్గించాలని గంభీర్ బోర్డును కోరినట్లు తెలుస్తోంది.

కుటుం సభ్యులకు నో ఛాన్స్..
'గత రివ్యూ మీటింగ్‌లో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ గురించి గంభీర్ సుదీర్ఘంగా మాట్లాడాడు. ఆటగాళ్ల క్రమశిక్షణకు సంబంధించిన అంశాలను బోర్డు దృష్టికి తీసుకొచ్చాడు. అందుకే బీసీసీఐ కొవిడ్ ముందున్న రూల్స్‌ను మళ్లీ అమలు చేయాలని భావిస్తోంది. కుటుంబ సభ్యులను రెండు వారాల కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేకుండా నిబంధనను ప్రవేశ పెట్టాలని చూస్తోంది.
గంభీర్ ఈ విషయంలో పట్టుబట్టాడు. ఆటగాళ్లూ కూడా ఇందుకు అంగీకరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరో సీనియర్ ఆటగాడు మ్యాచ్‌ల ఫీజుల విషయంలోనూ ఓ సలహా ఇచ్చాడు. సిరీస్ ముగిసిన వెంటనే ఇవ్వకుండా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా అందజేయాలని చెప్పాడు. ఎవరైతే దేశవాళీ, జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వరో వారిని పక్కన పెట్టాలని కూడా సూచించాడు.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.
గ్రూపులుగా విడిపోవడం..
ఆస్ట్రేలియా పర్యటనలో ఆటగాళ్లు అంతా ఒకే ఒక్కసారి కలిసి డిన్నర్ చేశారు. ప్రతీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు గ్రూప్‌లుగా మారి బయటకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఆటగాళ్లంతా విడి విడిగా ఉండటం కోచ్ గంభీర్‌కు నచ్చలేదని ప్రచారం జరుగుతోంది.
మళ్లీ యో-యో
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియాలో తప్పనిసరిగా యో-యో టెస్ట్ నిర్వహించేవారు. ఈ పరీక్షతోనే ప్లేయర్ల ఫిట్‌నెస్ లెవల్స్‌ను నిర్థారించేవారు. ఈ టెస్ట్ విఫలమైన వారిని జట్టులోకి తీసుకునేవారు కాదు. అయితే, ఈ టెస్ట్‌ను అధిగమించడంలో ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనే విమర్శలు రావడంతో బోర్డు ఈ టెస్ట్‌ను పక్కన పెట్టేసింది. టీమిండియా ప్రదర్శన దారుణంగా మారడం.. బుమ్రా, ఆకాశ్ దీప్ వంటి ఆటగాళ్లు సిరీస్ మధ్యలోనే గాయపడటంతో మళ్లీ యో యో టెస్ట్‌ను తీసుకురావాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.