IND vs NZ: మహమ్మద్ షమీ రీఎంట్రీ..!
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో షమీ బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతోంది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా ఆడుతున్న మహమ్మద్ షమీ పునరాగమనం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. అతని దేశవాళీ ప్రదర్శనతను బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరిసారిగా భారత్ జట్టు తరఫున ఆడిన షమీ.. మళ్లీ అవకాశం అందుకోలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం గాయంతో అతను జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా.. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే యోచనతో సెలెక్టర్లు షమీని పట్టించుకోలేదు. భారత సెలెక్టర్ల తీరుపై షమీ కూడా అసహనం వ్యక్తం చేశాడు. తనకు సెలెక్టర్ల నుంచి ఎలాంటి సమాచారం లేదని చెప్పాడు. రిటైర్మెంట్ అంటూ వచ్చిన వార్తలను కూడా ఖండించాడు.

సూపర్ ఫామ్‌లో షమీ..
విజయ్ హజారే ట్రోఫీ షమీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. బెంగాల్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన షమీ 6 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే భారత జట్టులో షమీకి చోటు దక్కలేదు. అయితే న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం సెలెక్టర్లు ఇంకా భారత జట్టును ప్రకటించలేదు.
మరో రెండు రోజుల్లో ఈ జట్టును ప్రకటించనున్నారు. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో బుమ్రాకు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే షమీని వన్డే టీమ్‌లోకి తీసుకోవాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 'మహమ్మద్ షమీ ఎంపిక గురించి చర్చ జరుగుతుంది. అతని నైపుణ్యంపై ఎలాంటి సందేహం లేదు. కానీ అతని ఫిట్‌నెస్ గురించే ఆందోళన. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అతను ఎంపిక కావచ్చు. అలాగే వన్డే ప్రపంచకప్ 2027లో కూడా అతను ఆడే అవకాశాన్ని కొట్టిపారేయలేం.'అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
టెస్ట్‌లు ఆడక రెండేళ్లు..
వన్డే ప్రపంచకప్ 2023లో షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత అతను ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలో సెలెక్టర్లు పట్టించుకోలేదు. టీ20ల్లో ఈ ఏడాది ఫిబ్రవరి ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా బరిలోకి దిగాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తరహాలో వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగి వరల్డ్ కప్ ఆడాలని షమీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications