న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం(మే28)న జరగనున్న ఈ మెగా ఫైనల్‌కు ప్రత్యేక అతిథులును ఆహ్వానించింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డును మినహా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో భాగమైన ప్రతీ బోర్డు ప్రెసిడెంట్స్‌ను ఆహ్వానించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించినట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు. ఐపీఎల్ 2023 ఫైనల్ సందర్భంగానే ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌కే ఉండగా.. అక్కడికి వెళ్లేందుకు భారత్ ఒప్పుకోవడం లేదు. భద్రతా కారణాలను సాకుగా చూపిస్తోంది. దాంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించింది. భారత్‌తో జరిగే మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించి మిగతా మ్యాచ్‌లను పాక్‌లో జరుపుతామని తెలిపింది.
అంతకుముందు తమ దేశానికి టీమిండియా రాకుంటే.. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా ఇంగ్లండ్ వేదికగా టోర్నీ నిర్వహించాలని కూడా డిమాండ్ చేసింది. దాంతో ఆసియా కప్ నిర్వహణపై రోజుకో వార్త బయటకు వస్తోంది. భారత్ మాత్రం శ్రీలంక వేదికగా ఈ టోర్నీని నిర్వహించాలని పట్టుబడుతోంది. తద్వార ఆర్థికంగా చితికిపోయిన ఆ దేశానికి అండగా నిలిచినట్లవుతుందని వాదిస్తోంది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా కొనసాగుతుండగా.. పీసీబీ మినహా ఇతర క్రికెట్ బోర్డులు బీసీసీఐకి అనుకూలంగా మాట్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ సందర్భంగా ఆసియాకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్‌లో మరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలివున్నాయి. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా, మరో బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2లో పోటీపడనున్నాయి. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగానే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫైనల్లో చెన్నైతో తలపడనుంది.