ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు వేడుకల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకుల ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసిన సాయుధ దళాలకు ఆహ్వానాలు పంపింది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌కు హాజరై ముగింపు వేడుకల్లో పాల్గొనాలని, బీసీసీఐ సత్కారాన్ని స్వీకరించాలని కోరింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.
'ఆపరేషన్ సిందూర్ సమయంలో మన త్రివిధ దళాలు ప్రదర్శించిన పరాక్రమాలు, దైర్య సాహాసాలు ఎంతో మందికి స్పూర్తిదాయకం. వారి నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఐపీఎల్ ముగింపు వేడులను అంకితమివ్వాలని నిర్ణయించాం. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, ఆర్మీ టాప్ ర్యాంక్ అధికారులు, పలువురు జవాన్లను ఈ ముగింపు వేడుకకు ఆహ్వానించాం. క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టమే. కానీ, దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదు.'అని దేజిత్ సైకియా పేర్కొన్నారు.

అహ్మదాబాద్ వేదికగా జూన్ 3న ఫైనల్ జరగనుండగా.. ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుల ప్రదర్శనలతో పాటు ఆర్మీ బ్యాండ్స్‌తో పరేడ్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లో ఉగ్రవాదులను హతమార్చింది. ఈ ఆపరేషన్‌తో 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వచ్చాయి.
ఆపరేషన్ సిందూర్ ప్రతీకారంగా పాకిస్థాన్ మిసైల్ దాడులకు పాల్పడగా భారత బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ వారంపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో మే 25న ముగియాల్సిన ఐపీఎల్ 2025 సీజన్ జూన్ 3 వరకు జరుగుతుంది. అహ్మాదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.