టీమిండియా ఘోర పరాజయాల నేపథ్యంలో ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కఠిన రూల్స్‌ను అమలు చేసేందుకు సిద్దమైంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనతో డ్రెస్సింగ్ రూమ్‌ను సెట్ చేసేందుకు ఏకంగా 10 కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ వివరాలను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. ఈ రూల్స్ పాటించని ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కదని స్పష్టం చేసింది.
జట్టులో స్టార్క్ సంస్కృతికి తెరదించేందుకు నడుం బిగించింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బందిని అనుమతించడంపై ఆంక్షలు విధించింది. మ్యాచ్ ప్రాక్టీస్ ఎగ్గొట్టడం.. మ్యాచ్‌ల సందర్భంగా సొంత వాహనాల్లో ప్రయాణించడంపై నిషేధం విధించింది. ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని పేర్కొంది.

బీసీసీఐ విడుదల చేసిన 10 రూల్స్ ఇవే..
1.బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ అనుమతి లేకుండా ఆటగాళ్ల వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకెళ్లడం ఇక నుంచి కుదురదు. ఆటగాళ్ల మేనేజర్లు, వంటవాళ్లు, సెక్యూరిటీ వంటి వారిని అనుమతించరు.
2. ఆటగాళ్లు తమ వస్తువులు, సామాగ్రి బరువు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్దేశించిన పరిమితుల్లోనే ఉండాలి. అదనపు లగేజీ తీసుకెళ్లాలంటే టీమ్‌మేనేజ్‌మెంట్ అనుమతి తీసుకోవాలి. అందుకు తమ సొంత ఖర్చును భరించాల్సి ఉంటుంది.
3. ఆటగాళ్లు ఇక మీదట వ్యక్తిగతంగా కాకుండా జట్టుతోనే ప్రయాణించాలి. ఒకవేళ కుటుంబంతో జర్నీ చేయాలంటే ముందస్తుగా కోచ్ లేదా సెలెక్షన్ కమిటీ పర్మిషన్ తీసుకోవాలి. జట్టుతో ప్రయాణించడం ద్వారా టీమ్ ఐక్యత బలోపేతం అవుతోంది. సహచరులతో క్రమశిక్షణగా నడుచుకోవాలి.
4. ప్రతీ ఆటగాడు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. దేశవాళీ క్రికెట్ ఆడేవారికే భారత జట్టులో చోటు దక్కుతోంది. మ్యాచ్ ఫిట్‌నెస్, స్ట్రెంగ్త్, ఫామ్‌ను మెరుగుపర్చుకోవడానికి దేశవాళీ క్రికెట్ చాలా ముఖ్యమని బోర్డు స్పష్టం చేసింది.
5. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు తీసుకెళ్లాల్సిన వస్తువులు, పరికరాల విషయంలో ఆటగాళ్లు టీమ్ మేనేజ్‌మెంట్‌తో సమన్వయం చేసుకోవాలి. అలా కాకుండా ప్రత్యేకమై సౌకర్యాలు కావాలంటే ఆటగాళ్లు ఆ ఖర్చును భరించాల్సి ఉంటుంది.
6. ముందుగా నిర్దేశించిన ప్రాక్టీస్ షెడ్యూల్ ముగిసేవరకు ఆటగాళ్లందరూ నెట్‌సెషన్‌లోనే ఉండాలి. ప్రాక్టీస్ సెషన్ పూర్తయిన తర్వాతే ఒకేసారి అందరూ కలసి ప్రయాణించాలి.
7.విదేశీ పర్యటనల సమయంలో ఎలాంటి పర్సనల్ షూట్స్ లేదా ఎండార్స్‌మెంట్స్‌లో పాల్గొనడానికి వీలు లేదు. ఆట మీద ఫోకస్ దెబ్బతినకుండా ఉండేందుకు బోర్డు ఈ మేరకు కఠిన నిబంధనను తీసుకొచ్చింది.
8. విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ల వెంట వారి కుటుంబ సభ్యులను గతంలో మాదిరి అనుమతించరు. 45 రోజులు దాటిన విదేశీ పర్యటనల్లో మాత్రమే ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు అనుమతి ఇస్తారు. అది కూడా 2 వారాలకే పరిమితం.
9. బీసీసీఐ అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలు, ప్రమోషనల్ ఈవెంట్స్‌కు ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉండాలి. ముందస్తు అనుమతి లేకుండా డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవు.
10. ఆటగాళ్లు అందరూ క్రమశిక్షణతో కలిసికట్టుగా ఉంటూ జట్టు విజయం కోసం కష్టపడాలి. ఇది ఆటలో మెరుగుదలకు దోహదపడుతుందని బీసీసీఐ పేర్కొంది. అలాగే సిరీస్ లేదా మ్యాచ్‌లు ముందుగానే ముగిసినా అంతా కలిసే ప్రయాణం చేయాలి. అనుమతి లేకుండా ఎవరికీ వారు వెళ్లడానికి వీలు లేదు.