భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెటర్లకు కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలకు క్యాష్ ప్రైజ్ అందజేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం మహిళల జూనియర్ స్థాయి నుంచి అన్నీ టోర్నీల్లో అమలవుతుందని స్పష్టం చేసింది. ఇక పురుషుల దేశవాళీ క్రికెట్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలకు క్యాష్ ప్రైజ్ అందజేస్తామని స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. 'మా దేశీయ క్రికెట్ ప్రోగ్రామ్ కింద మేం మహిళల జూనియర్, సీనియర్ క్రికెట్ టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలకు క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించాం. అదేవిధంగా సీనియర్ పురుషుల కోసం నిర్వహించే విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలకు ప్రైజ్ మనీ దక్కుతుంది.

డొమెస్టిక్ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లకు రివార్డ్ అందజేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన అపెక్స్ కౌన్సిల్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. మేమంతా కలిసి క్రికెటర్లకు మరిన్ని రివార్డ్స్ అందే వాతావారణాన్ని సృష్టిస్తాం.'అని జై షా ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలకు మాత్రమే బీసీసీఐ క్యాష్ రివార్డ్స్ ఇచ్చేది. దేశవాళీ క్రికెట్‌లో రంజీ ట్రోఫీలో మాత్రమే క్యాష్ రివార్డ్స్ ఇచ్చేవారు. తాజా నిర్ణయంతో దేశవాళీ క్రికెట్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకం లభించనుంది.
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. శభాష్ జై షా అంటూ క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు కొనియాడుతున్నారు. దేశవాళీ క్రికెట్ మరింత బలోపేతం అయ్యేందుకు ఈ నిర్ణయం మరింత బాగుపడుతుందని, ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేలా మరింత ప్రోత్సహిస్తుందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో భారత దేశవాళీ క్రికెట్‌కు తెరలేవనుంది. అయితే క్యాష్ ప్రైజ్‌గా ఎంత ఇస్తారనే వివరాలు మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.